– కాంగ్రెస్‌లో బీసీ వాదం.. నేతల మల్లగుల్లాలు
– ఆ ఇద్దరు పార్లమెంట్‌కేనా..?
– కోమటిరెడ్డి వ్యాఖ్యల వెనుక వ్యూహం ఏంటి?
నవతెలంగాణ-మిర్యాలగూడ
కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం అమలు అవుతుందా…? అధిష్టానం నిర్ణయించిన ప్రకారం ఒక్కో పార్లమెంటు పరిధిలో రెండు టికెట్లు బీసీలకు కేటాయించాలనే నిర్ణయం ఆచరణకు వస్తుందా..? హేమహేమీలున్న కాంగ్రెస్‌లో అది సాధ్యమేనా…? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఎక్కడ నలుగురు కూడినా బీసీ వాదమే చర్చకు వస్తోంది. అది కచ్చితంగా అమలు చేస్తే ఎవరి సీటుకు ఎసరు వస్తుందో అనే దానిపై నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇటీవల భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక వ్యూహం ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని పీసీసీ ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఒక పార్లమెంటు పరిధిలో రెండు టికెట్లు బీసీలకు ఇవ్వాలనే వాదనను తెరపైకి తెచ్చారు. అవసరమైతే బీసీల కోసం నల్లగొండ పార్లమెంటు పరిధిలో నల్లగొండ సీటు తాను వదులుకుంటానని, అధిష్టానం సూచన మేరకు బీసీలకు ఇచ్చి గెలిపించుకుంటానని వ్యాఖ్యలు చేశారు. మిగిలిన ఆరు సెగ్మెంట్లలో మరొక సీటు ఎవరైనా ఒకరు త్యాగం చేయాలని సూచించారు. దాంతో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. నల్లగొండ పార్లమెంటులోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఒకటి ఎస్టీ (దేవరకొండ) పొగా మిగిలిన 6 స్థానాల్లో ఓసీలు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ వదులుకోవాల్సి వస్తే హుజూర్‌నగర్ లేదా కోదాడ నియోజవర్గాన్ని బీసీలకు కేటాయించే అవకాశం ఉంది. కాగా నల్లగొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మరో ఆరుగురు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో బీసీ సామాజిక తరగతికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మెన్ బొడ్డుపల్లి లక్ష్మి.. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అత్యంత సన్నిహితురాలు. అలాగే, తండు సైదులు యాదవ్, చెరుకు సుధాకర్ ఉన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యూహాత్మకంగా బొడ్డుపల్లి లక్ష్మితో దరఖాస్తు చేయించారని ప్రచారం ఉంది. బీసీకి అవకాశం కల్పిస్తే లక్ష్మికి టికెట్ ఇప్పించే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. తాను ఎంపీగా పోటీ చేస్తానని, లేకపోతే ఎమ్మెల్సీగా ఉంటానని చెప్పుకొచ్చారు. దాంతో నల్లగొండలో బీసీ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఆ ఇద్దరు పార్లమెంటుకేనా..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ, భువనగిరి పార్లమెంటు స్థానాలున్నాయి. నల్లగొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నల్లగొండ పార్లమెంట్ పరిధిలో నల్లగొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట, నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాలున్నాయి. భువనగిరి పార్లమెంట్ పరిధిలో భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్‌లో సగం, మునుగోడులో సగం, జనగామ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలున్నాయి. భువనగిరి అసెంబ్లీ నియోజవర్గానికి 11 మంది దరఖాస్తు చేసుకోగా అందులో ఒక మైనార్టీ, ఇద్దరు ఓసీలు, మిగి లిన ఎనిమిది మంది బీసీలున్నారు. బీసీలకు కేటాయిస్తారని ప్రచారం ఉండటంతో ఆశావహులు ఎదురుచూస్తున్నారు. మరొక స్థానంలోనూ బీసీలకు అవకాశం కల్పిస్తారని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. ఆ స్థానం ఏదయి ఉంటుందని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ఎంపీలను తిరిగి పార్లమెంట్‌కే పోటీ చేయాలని ఢిల్లీ అధిష్టానం సూచించినట్టు సమాచారం. పార్లమెంట్‌కు పోటీ చేయడం వల్ల ఆ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థికి కలిసి వస్తుందని అధిష్టానం భావిస్తోంది. ఎక్కువ స్థానాలు గెలవడంతోపాటు బీసీ ఓట్లు తమకు అనుకూలంగా మారుతాయని అంచనాకొచ్చారు. దీనికి తోడు రెండు పార్లమెంటు స్థానాలూ గెలిచేందుకు అవకాశం ఉంటుందని భావించి పార్లమెంటుకి పోటీ చేయాలని ఉత్తమ్ కమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలపై అధిష్టానం ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీసీలకు ఇస్తే తన సీటును త్యాగం చేస్తానని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.