మన దేశాన్ని ”భారతమాత”గా సమున్నతంగా, సముచితంగా మర్యాదపూర్వకంగా గౌరవించుకుంటున్న సమాజం మనది. కానీ నేడు మనిషి విచక్షణ కోల్పోయి మహిళలపై లైంగికదాడులు, హత్యలు, అఘాయిత్యాలు తెగబడుతున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. మానవ మృగాలు అనేక విధాలు(రకాలు)గా ఆకృత్యాలకు పాల్పడటంతో దేశం అనాగరికతకు ముఖచిత్రంగా మారుతోంది. ప్రజాస్వామ్య దేశంలో చట్టబద్ధ పాలనలో ఆడపిల్లలు, మహిళలపై అమానుష అకృత్యాలకు బరితెగిస్తూ, తెగబడుతున్న కీచకులకు సకాలంలో కఠిన శిక్షలు విధించలేనప్పుడు, లింగ వివక్షను సమూలంగా సమాజం నుండి నిర్మూలంచనప్పుడు మనది చట్టబద్ధ పాలన అనిపించుకోదు. కలకత్తాలోని ఆర్ జీ వైద్య కళాశాల ఆసుపత్రిలో ట్రెయినీ డాక్టర్ పై ఘోరాతి ఘోరంగా, అమానుషంగా హత్యాచార ఘటనకు పాల్పడిన రాబంధులకు శిక్ష పడుతుందా? ఈ కేసుపై అనేక సందేహాలు ప్రతి ఒక్కరి హృదయాన్ని మెలివేస్తున్నది. చట్టాలు చట్టుబండలై, నేరస్తులకు చుట్టాలవుతున్నాయని యావత్ దేశం దిగ్భ్రాంతికి లోనవుతుంది.
గత పన్నెండేళ్ల క్రితం దేశ రాజధానిలో కదులుతున్న బస్సులో ”నిర్భయ” పై జరిగిన హత్యాచారం దేశవ్యాప్తంగా గగ్గోలు రేపింది. స్త్రీలకు సరైన రక్షణ కల్పించలేని వ్యవస్థల అసమర్ధతను చీత్కరిస్తూ ఆనాడు యువత పెద్ద ఎత్తున ఉద్యమించింది. ఇకపై అటువంటి ఘోరకృత్యాలు దేశంలో చోటు చేసుకోకుండా చూస్తామంటూ మాటలెన్నో చెప్పిన నాటి పాలకులు హడావుడి చట్టాలకు పదును పెట్టారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన కీచకులకు కఠిన శిక్షలు పడేలా చట్టాలను రూపొందించారు. అయినా ఆ తర్వాత కూడా హైదరాబాద్‌లో ”దిశ” ఉదంతం మన పాలనావ్యవస్థను బట్టబయలు చేసింది. ఇలా మహిళలపై రేప్‌లు, మర్డర్లు నిత్యం దేశంలో ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి. చట్టాలెన్ని వచ్చినా ”శిక్ష పడుతుందనే భయం లేకనే” ఇంత అమానవీయంగా వ్యవహరిస్తున్నట్టు అర్థమవుతున్నది. నాటితో పోలిస్తే పరిస్థితులు ఇంకా అధ్వానంగా తయారయ్యాయి. అధికారిక గణాంకాల ప్రకారమే 2012లో దేశవ్యాప్తంగా స్త్రీలపై దాదాపు పాతికవేల హత్యాచారాలు చోటుచేసుకున్నాయి. 2022లో అవి 31,516కు పెరిగాయి. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, ఒడిశాలో ‘మృగాళ్లు’ మహిళలపై స్వేచ్ఛా విహారం చేస్తున్నట్లు సర్కారీ నివేదికలే వెల్లడిస్తున్నాయి.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో స్త్రీలపై లైంగికదాడులు ఎక్కువగానే జరుగుతున్నాయి. గృహహింస, అపహరణ, హత్యాచారం, బాలికలు, మహిళల అక్రమ రవాణా, లైంగిక వేధింపుల వంటివి ఏడాదికేడాది అధికమవుతున్నాయి. ఇది మహిళలకు ప్రాణసంకటంగా, ప్రగతికి ఆటంకంగా మారుతుంది. ఇదిలా ఉంటే బాలికలు, మహిళలపై నమోదవుతున్న అనేకానేక నేర ఘటనలు అసలు వెలుగులోకి రావడం లేదు. ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెనుకాడడమే అందుకు ప్రధాన కారణం. వారు ధైర్యంగా ఫిర్యాదు ఇచ్చిన సందర్భాల్లోనూ కేవలం 1.6 శాతం కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడుతుండటం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. ఇలాంటి అలసత్వం మూలంగా దేశంలో మహిళలు, బాలికలపై హింస అంతకంతకూ పెరిగిపోతోంది. కేంద్ర గణాంకాలు, మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన ”భారత్‌లో మహిళలు-పురుషుల పరిస్థితి-2023” నివేదిక ప్రకారం మహిళలపై జరిగిన దారుణాలపై విచారణకు వచ్చిన ఉదంతాల్లో కేవలం రెండుశాతం లోపు కేసుల్లో మాత్రమే శిక్షలు పడుతున్నాయి. ఇలా అనేక రకాలుగా స్త్రీలపై హింస, లైంగిక దాడులు, బలవంతపు వివాహాలు, సైబర్ వేధింపులు, అక్రమ రవాణా, దాష్టీకాలు జరుగుతున్నాయి. ఈ హింసాత్మక పరిస్థితులు వారి ఎదుగుదలకు ప్రధాన అవరోధంగా మారుతున్నాయని నివేదిక వివరించింది. దాన్ని అంతం చేయడం ద్వారానే అతివల సాధికారతకు అడ్డంకులు తొలగుతాయని పేర్కొంది.
ఈ ఘటనల్లో బాధితుల్లో అత్యధికులు 18 నుంచి 30 ఏళ్ల లోపు మహిళలే అధికంగా ఉండడం, బాధితుల్లో పనిచేసే వారిలోనే ఎక్కువమంది పై ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇంటా, బయట పనిచేసే చోటుకు వెళ్తున్నప్పుడు అఘాయిత్యాలకు బలవుతున్నారు. రాత్రిపూట పని వేళల్లో పనిచేసే ప్రదేశాలలో అత్యాచారాలు జరుగుతున్నాయి. లైంగికదాడుల నిరోధానికి ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు శూన్యంగానే కనిపిస్తున్నాయి. ఘటనల్లో చాలావరకు వెలుగు చూడడం లేదు. తమపై జరిగిన హింసాత్మక ఘటనలు బయటపెట్టడం తమకు కళంకంగా, అవమానంగా మారుతుందనే భయాందోళన, అపోహలతో చాలామంది ఫిర్యాదు చేయడానికి కూడా ముందుకు రావడం లేదు.
భారతదేశం ప్రగతి పథంలో ఆర్థిక శక్తిగా దూసుకు పోతుందని గొప్పలు చెప్పకుంటున్న పాలకులు ఆ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్న మహిళల్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు, అన్నిరంగాలు, విభాగాల్లో మహిళా భాగస్వామ్యం ఇంకా పెరగాలంటే వారి భద్రత ప్రభుత్వాల బాధ్యత. అది సాధ్యపడాలంటే? పని ప్రదేశాల్లో కనీస రక్షణ చర్యలు కల్పించబడాలి. వాటిని పర్యవేక్షించేందుకు కమిటీని నియమించి, నిరంతరం పర్యవేక్షించాలి. సమాజాన్ని తిరోగమనపథంలో నడిపించే మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలంటే ఇంటా, బయట లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో కేసులను సత్వరం విచారణ జరిపి దోషులకు కఠినమైన శిక్షలు విధించాలి. సమాజంలో నైతిక విలువలు పెంపొందించడంలో ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దేశానికి తల వంపు తెస్తున్న ఈ హత్యాచార విష సంస్కృతిని రూపుమాపినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది.
మహిళలు ఆగ్రహిస్తే ఈ సృష్టికి, మానవ జాతికి పుట్టగతులుండవన్న సంగతి పాలకులు గుర్తెరగాలి. సమాజంలో నైతిక విలువల్ని పెంపొందించడంలో ప్రభుత్వాలు కృషి చేయాలి. లైంగికదాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. శిక్షలు పడేలా చూడాలి. లేదంటే ఎప్పటిలాగే ‘మహిళల భద్రత గాలిలో దీపమే’ అవుతుంది.
మేకిరి దామోదర్
9573666650