30 నుంచి ఐసెట్‌ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌

– అక్టోబర్‌ 2 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదు
– షెడ్యూల్‌ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్‌ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఈనెల 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, ఐసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ శ్రీదేవసేన శుక్రవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈనెల 30న ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉంటుందనీ, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించేందుకు అవకాశముందని తెలిపారు. వచ్చేనెల ఒకటిన ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని వివరించారు. అదేనెల ఒకటి, రెండు తేదీల్లో వెబ్‌ఆప్షన్లను నమోదు చేసేందుకు అవకాశముందని పేర్కొన్నారు. వచ్చేనెల నాలుగున సీట్లు కేటాయిస్తామని తెలిపారు. అదేనెల నాలుగు, ఐదు తేదీల్లో ట్యూషన్‌ ఫీజు చెల్లించడంతోపాటు వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని సూచించారు. వచ్చేనెల ఐదు నుంచి ఏడో తేదీ వరకు కేటాయించిన కాలేజీల్లో అభ్యర్థులు రిపోర్టు చేయాలని తెలిపారు. ఇతర వివరాల కోసం https://tgicet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు. వచ్చేనెల ఆరో తేదీన ఐసెట్‌ స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలను విడుదల చేస్తామని పేర్కొన్నారు.