నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఐసెట్ ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బుధవారం ఎంబీఏ, ఎంసీఏలో ఖాళీ సీట్ల వివరాలను కాలేజీలు నోటిసు బోర్డులో అందుబాటులో ఉంచాలని సూచించారు. అదేరోజు స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేయాలని కోరారు. ఖాళీల భర్తీకి పత్రికల్లో నోటిఫికేషన్‌ను ప్రచురించాలని వివరించారు. ఈనెల 15,16 తేదీల్లో కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించాలని తెలిపారు. ఇతర వివరాల కోసం https://tgicet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.