నేటినుంచి ఐసెట్‌ రాతపరీక్షలు

– 86.184 మంది దరఖాస్తు
– 116 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్‌ రాతపరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఐసెట్‌ కన్వీనర్‌ ఎస్‌ నర్సింహాచారి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బుధవారం రెండు విడతల్లో, గురువారం ఒక విడతలో రాతపరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అబ్బాయిలు 41,203 మంది, అమ్మాయిలు 44,980 మంది కలిపి 86,184 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. తెలంగాణలో 111, ఏపీలో ఐదు కలిపి మొత్తం 116 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండబోదని స్పష్టం చేశారు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రాతపరీక్షలుంటాయని తెలిపారు. సకాలంలో పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు చేరుకోవాలని సూచించారు.