నేడు దేశంలో బీజేపీ బాపుజీపై చూపుతున్న గౌరవం కానీ, ఒలకపోస్తున్న ప్రేమ కానీ చూస్తుంటే
”పైపై సొగసులు కల్ల సుమా!
లోపలిదంతా డొల్ల సుమా!
నిజం తెలియమని నేనంటాను
లేదా కొంపే గుల్ల సుమా!” అన్న దాశరథి కష్ణమాచార్య కవితా వాక్కులు గుర్తుకు రాకమానవు. నిన్న (సోమవారం) మహత్మాగాంధీ 76వ వర్థంతి సందర్భంగా బాపు ఘాట్‌కు ప్రధానమంత్రి దగ్గర నుంచి చోటామోటా నేతల వరకు క్యూ కట్టి నివాళులర్పించి, అక్కడ జరిగే సామూహిక ప్రార్థనల్లో కూడా పాల్గొన్నారు. వాళ్లే నిన్నటికి నిన్న పాట్నాలో నిర్వహించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాల్లో మహత్ముడిపై ద్వేషాన్ని వెల్లకక్కారు. భోజ్‌పురి గాయకురాలు దేవి గాంధీజీకి అత్యంత ప్రీతిపాత్రమైన ‘రఘుపతి రాఘవ రాజారామ్’ భజనను ఆలపిస్తున్న తరుణంలో అందులో ‘అల్లా’ అన్న పదం వచ్చిందన్న కారణంతో ఆమెను కమల దళం అడ్డుకున్నది. కేంద్ర మాజీ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే సహా పలువురు నాయకులు ఆమె నుండి మైక్రోఫోన్ లాక్కొని జైశ్రీరాం అంటూ నినాదాలు చేయడం గర్హనీ యం. అల్లా పేరును ఉచ్ఛరించి నందుకు క్షమాపణ చెప్పాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చి మరి చెప్పించారు. ‘జై సీతారామ్’కు బదులు ‘జై శ్రీరాం’ అని నినదించాలని ఒత్తిడి తెచ్చారని ఆమె వాపోయారు.
‘ఈశ్వర్ అల్లా తేరానామ్, సబ్‌కో సమ్మతి దేభగవాన్’ అని పాడుకున్న జాతిపిత గుండెలను తుపాకీ గుండుతో చీల్చిన గాడ్సే వారసులకు ఆ గీతంలో విద్వేషం కాక ఐక్యత కనబడాలని ఆశించడం అత్యాశే అవుతుంది. ఈ దేశంలో ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని కాంక్షిస్తూ మహత్ముడు ‘రఘుపతి రాఘవ రాజారామ్’ భజన గీతానికి ‘ఈశ్వర్ అల్లా తేరే నామ్, సబ్‌కో సమ్మతి దేభగవాన్’ అన్న వాక్యాలను జోడించారు. సూమారు వంద ఏండ్లకు ఆ గీతంలోని ‘అలా’్ల అన్న పదం కేంద్రపాలకులను కలవరపాటుకు గురిచేస్తోంది. మహాత్ముడి సత్యాహింసలు, సత్య్రాగ్రహా సూత్రాలు ప్రపంచ ప్రాచూర్యం పొందినట్టుగానే, నిన్నటి విద్వేషాన్ని కూడా ప్రపంచ మీడియా చర్చిస్తూన్నది. కానీ అధర్మం, అసత్యం రాజ్యమై సత్యాలోచనలను అణచివేస్తున్నది.
అన్ని మతాల ప్రజలు అన్నదమ్ము లుగా సహనంతో జీవించాలని ఘోషించినందుకు ఆనాడు మతోన్మాదికి ఆగ్రహం తెప్పించింది. స్వేచ్ఛ, సమానత్వాలను కోరుకున్నాడు గాంధీ. ఇవేవీ గాడ్సే భావానుచరులకు మింగుడుపడని విషయాలు. అందుకే వాళ్లిప్పుడు సత్యం, న్యాయం, సమానత్వం గురించి మాట్లాడే వారిని అణచివేసే హతమార్చే పనిలో ఉన్నారు. అందుకు అనేక ఉదాహరణలు న్నాయు.”యూపీ మే కాబా?” అని ఉత్తరప్రదేశ్‌లో ప్రజల బాధలను, రాజకీయుల దుర్మార్గాలను, సామాజిక పరిస్థితులను వ్యంగ్యంగా గానం చేసిన భోజ్‌పురి జానపద గాయని నేహాసింగ్‌కు నోటీసులిచ్చి నానా యాగీ చేసింది యోగీ సర్కార్. ఎవరు గొంతు విప్పినా వీరు నిర్భంధకాండకు పూనుకుంటున్నారు. ఒక భయానక వాతావరణాన్ని సష్టిస్తున్నారు. మత సామరస్యత పోయి, మత విద్వేషం, మానవతా విధ్వంసం పెల్లుబుకుతున్న సందర్భాన శాంతి, అహింసల గాంధీతత్వాన్ని చర్చించటం సాహసమే.
మన దేశ సామాజిక సాంస్కతిక బహుళత్వాన్ని అర్థం చేసుకుని, ఐక్యతను సాధించాలని తపన పడిన నాయకుడు గాంధీజీ. స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన పాత్ర, ప్రజలను ఏకం చేసిన తీరు చరిత్రలో నిలిచిపోయే ఒక అధ్యాయం. కానీ నేడు ఆ చరిత్రనూ కనుమరుగు చేసే ప్రయత్నాలూ జోరుగా సాగుతున్నాయి. ఆయన ఆలోచనలపై ఆచరణపై భిన్నమైన అభిప్రాయాలెన్ని ఉన్నప్పటికీ నేడు దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకూ, భిన్నత్వంలో ఏకత్వానికి ముంచుకొస్తున్న ముప్పుకూ ఆనాటి విద్వేష హింసాలోచనల పరంపరనే. ఇప్పుడదే ఉన్మాదం సామూహిక విపత్తుగా పరిణమించిందన్న వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి.
వాళ్లు వేటినీ వొదలటం లేదు. విద్యను కాషాయీ కరించటమే కాదు, విద్యార్థులనూ, ఉపాధ్యాయులనూ మార్చేందుకు బలమైన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. చైతన్యయుతమైన తెలంగాణ నడిబొడ్డున అయ్యప్పమాలలో ఉన్న విద్యార్థికి పొరపాటున ప్రధానోపాధ్యాయుడి కాలు తగిలిందన్న కారణంతో మతోన్మాదులు రెచ్చిపోయారు. దళిత ఉపాధ్యాయుడిపై కక్షగట్టింది అక్కడి మతతత్వం. బలవంతంగా ఆ గురువుతో విద్యార్థి కాలుపట్టించి క్షమాపణలు చెప్పించటం గమనిస్తే, మన విద్యా వ్యవస్థలోకి మూఢత్వ విద్వేషం ఎలా దూసుకొస్తుందో తేటతెల్లమవు తోంది. ఇది కేవలం ఒక సంఘటనగానే అర్థం చేసుకోలేము. రాబోయే కాలంలో విజ్ఞానానికి, స్వేచ్ఛకు, విద్యార్థులకు, విద్యా వికాసానికి ఎన్ని అడ్డంకులు రానున్నాయో తెలిపే సూచిక కూడా. రామరాజ్యమని చెప్పుకునే పాలకుల కాలంలో ఈ ఘటనలు ఆశ్చర్యపర్చవు. కానీ, కళాకారులు, రచయితలు, మేధావులు గొంతెత్తాల్సిన అవసరాన్ని ఇలాంటి సంఘటనలు ఎరుకపరుస్తున్నాయి.