నీవు నేర్పిన విద్యయే కదా..?

అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ముందు నేతల గోడ దూకుళ్లు, జంప్‌ జిలానీలు ఓ రేంజ్‌లో కొనసాగాయి. హమ్మయ్య… ఈ రెండు ఎలక్షన్లు అయిపోయాయి కాబట్టి, ఏ గూటిలో పక్షి ఆ గూటిలో ఉంటుందనుకుంటే ఇప్పుడు అంతకు మించిన స్పీడుతో లీడర్లు పార్టీలను ఫిరాయిస్తుండటం సదరు నాయకాగ్రేసురులపై నమ్మకం పెట్టుకున్న నేతలకు మింగుడు పడటం లేదు. తాజాగా మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ఉదంతమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఆయనతోపాటు మరికొంత మంది గులాబీ ఎమ్మెల్యేలు గోడ దూకేం దుకు రెడీగా ఉండటం నిజంగా ఆ పార్టీకి చేదు గుళికే. అయితే అలాంటోళ్లను చేర్చుకుంటున్న అధికార కాంగ్రెస్‌ మాత్రం.. ఈ చేరికలకు మాకు స్ఫూర్తి ప్రదాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆరేనని చెబుతోంది. ఈ విషయంలో ఆయనే మాకు మార్గదర్శి అంటూ వేనోళ్ల పొగడ్తలతో ముంచెత్తుతోంది. గత పదేండ్ల బీఆర్‌ఎస్‌ హయాంలో 2014లో ప్రజలు ఆ పార్టీకి 63 సీట్లిచ్చి అధికారాన్ని కట్టబెట్టారు. 2018లో ముందస్తు ఎన్నికల్లో 88 సీట్ల దాకా ఇచ్చి గద్దెనెక్కించారు. కానీ ఆ సంఖ్యాబలం చాలదన్నట్టు ఆ పార్టీ బాస్‌… కాంగ్రెస్‌, ఇతర పార్టీల నుంచి ఇబ్బడి ముబ్బడిగా ఎమ్మెల్యేలను తీసుకుని ‘కారె’క్కించారు. ఆయన గారి దెబ్బకు ఆఖరికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు ఆ హోదా దక్కకుండా పోయింది. ‘ఫ్రెండ్లీ పార్టీ…’ (ఇప్పుడు ప్లేటు ఫిరాయించి కాంగ్రెస్‌తో జతకట్టింది అనుకోండి…) అయిన ఎంఐఎం ఆ స్థానాన్ని ఆక్రమించింది. కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, ఇతర పార్టీల నుంచి అరువొచ్చిన లీడర్లతో కారుకు ఓవర్‌లోడ్‌ అయ్యింది. ఆ బరువును మోయలేక మొన్నటి అసెంబ్లీ, నిన్నటి పార్లమెంటు ఎన్నికల్లో కారు బోల్తా కొట్టింది. ఇవన్నీ గుర్తుచేస్తూ ఓ లీడర్‌ అన్నమాటేంటంటే.. ‘నీవు నేర్పిన విద్యయే కదా.. నీరజాక్షా..? అన్న చందాన అప్పుడు కేసీఆర్‌ ప్రతి పక్షాలు లేకుండా చేయా లని అనుకున్నారు..ఇప్పుడు రేవంత్‌ అదే బాటలో నడుస్తున్నారు…’ అని…
-బి.వి.యన్‌.పద్మరాజు