కడుపుతో ఉన్నంక కనక తప్పుతదా ..

కడుపుతో ఉన్నంక కనక తప్పుతదా ..కొన్ని కార్యాలు ఎవరి చేతుల్లోనూ ఉండవు. కాలక్రమేణా అవి జరిగిపోతుంటాయి. నెల తప్పిందంటే నవ మాసాలు మోయాల్సిందే. మధ్యలో అవస్థలు భరించలేను అంటే ఆగేది కాదు. అందుకే ‘ముందే ఉండాలె ముందుచూపు’ అంటారు. అయ్యో అనుకునే వాళ్లను చూసే ‘కడుపుతో ఉన్నంక కనక తప్పుతదా’ అని అంటారు. సష్టి అనేది మామూలు విషయం కాదు అది ఒక మహా అద్భుతమైనది. అందుకని సష్టికారులకు ఎన్ని జేజేలు చెప్పినా సరిపోదు. కానీ వ్యవస్థలో స్త్రీలను చిన్నచూపు చూస్తారు. అందుకే ‘కడివెడు గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువే’ అనే సామెత కూడా ఉంది. ఎంత పెద్ద కాయ అయినా చిన్న కత్తితో ముక్కలు చేస్తారు. అట్లాగే కొన్ని జరగాల్సినవి జరిగిపోతాయి. ‘కక్కు వచ్చినా కళ్యాణ ఘడియ వచ్చినా ఆగదు’ అంటారు. కక్కడం ఉంటే వాంతులు అన్నట్టు. వాంతి వచ్చిందంటే ఆపడం కష్టం. దాంతోనే కళ్యాణం పోల్చారు. ఎన్ని ముహూర్తాలు కుదిరి నా ఒక్కోసారి పెళ్లిళ్లు కావు. అందుకే ‘కాలం కలిసి రాకపోతే కర్రనే పామై కరుస్తుందట’. అన్ని అడ్డంకులు దాటితే పెళ్లి. ఆ తర్వాతనే సంసారం.
– అన్నవరం దేవేందర్‌, 9440763479