ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ దాడి

Smoke and fire rise – సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలే లక్ష్యాలుగా.. వరుస దాడులతో బీభత్సం
– ఇద్దరు సైనికులు మృతి
– ఖండించిన ప్రపంచ దేశాలు
టెహరాన్‌ : హిజ్బుల్లా చీఫ్‌ నస్రల్లాను హత్య చేసిందన్న ఆగ్రహంతో ఈ నెల 1న ఇజ్రాయిల్‌పై ఇరాన్‌ దాదాపు 200 క్షిపణులతో దాడి చేసింది. దానికి ప్రతీకారంగా ఇజ్రాయిల్‌ శనివారం టెహరాన్‌పై దాడులకు పాల్పడింది. ఇరాన్‌ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలే లక్ష్యంగా విరుచుకుపడింది. శనివారం తెల్లవారు జామునుండే వరుస దాడులకు దిగింది. దాదాపు 20లక్ష్యాలపై దాడులకు పాల్పడింది. ఈ దాడులకు దాదాపు వంద విమానాలను బరిలోకి దింపింది. తమ వైమానిక రక్షణ వ్యవస్థలు ఆ దాడులన్నింటినీ విజయవంతం గా తిప్పికొట్టాయని ఇరాన్‌ పేర్కొంది. ఈ దాడుల్లో ఇద్దరు సైనికులు మరణించారని, కొన్ని ప్రాంతాల్లో పరిమిత నష్టం జరిగిందని పేర్కొంది. శుక్రవారమం తా జరిగిన పరిణామాలను అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు ఎప్పటికప్పుడు తెలియజేశామని ఇజ్రాయిల్‌ అధికారి ఒకరు తెలిపారు. శనివారం నాటి ఆపరేషన్‌ గురించి జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సులివాన్‌కు కూడా తెలియజేశామన్నారు. కాగా, ఇరాన్‌పై దాడిని సౌదీ అరేబియా, ఇరాక్‌లతో సహా పలు ముస్లిం దేశాలు తీవ్రంగా ఖండించాయి. పలువురు ప్రపంచ నేతలు ఈ దాడిని ఖండిస్తూ, ఇజ్రాయిల్‌ సంయమనంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఇజ్రాయిల్‌పై క్షిపణులను ప్రయోగించడానికి ఇరాన్‌ ఉపయోగించిన స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్‌ విమానాలు దాడులకు దిగాయని ఇజ్రాయిల్‌ మిలటరీ ప్రకటించింది. చమురు స్థావరాలపై దాడి జరిగిందా? లేదా? అనేది వెంటనే తెలియరాలేదు. మరోవైపు ఇజ్రాయిల్‌ చర్యలపై స్పందించే విషయంలో తాము తొందరపడబోమని ఇరాన్‌ ఎంపీ అహ్మద్‌ ఆజమ్‌ వ్యాఖ్యానించారు. అలాగే వెనుకాడబోమని కూడా స్పష్టం చేశారు. ‘మమ్మల్ని మేం రక్షించుకునే హక్కు మాకు వుంది. అందుకు తగినట్లే స్పందిస్తాం.’ అని ఆయన పేర్కొన్నారు.
ఇరాన్‌ పోలీసు కాన్వారుపై దాడి
10మంది పోలీసు అధికారుల మృతి
రెస్టివ్‌ ఆగేయ ఇరాన్‌లో శనివారం పోలీసు కాన్వారుపై జరిగిన దాడిలో 10మంది అధికారులు మరణించారని స్థానిక మీడియా తెలిపింది. ఇరాన్‌ రాజధాని టెహరాన్‌కు 1200 కిలోమీటర్ల దూరంలో గోహర్‌ కుహ్‌లో ఈ దాడి జరిగిందని పేర్కొంది. కొంతమంది దుండగులు ఈ దాడికి పాల్పడ్డారని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇర్నా వార్తా సంస్థ వెల్లడించింది. అంతకుమించి వివరాలు పేర్కొనలే దు. ఈ దాడికి సంబంధించి అనుమానితులెవరినీ గుర్తించలేదు. ఏ గ్రూపు కూడా ఈ దాడికి తమదే బాధ్యత అని ప్రకటించలేదు. ఇజ్రాయిల్‌ దాడుల నేపథ్యంలో ఈ దాడి కూడా చోటు చేసుకోవడం గమనార్హం.