– అమెరికా వ్యాఖ్యలు
– ఇజ్రాయిల్‌కు భద్రతా సాయంపై షరతులు వద్దు
– అమెరికా సెనెట్‌లో వీగిన తీర్మానం
– తుల్కారెమ్ శరణార్ధి శిబిరంపై 9గంటలకుపైగా దాడులు
డావోస్ (స్విట్జర్లాండ్), గాజా: పాలస్తీనా దేశం ఏర్పడేందుకు ఒక మార్గాన్ని రూపొందించాల్సిన అవసరం వుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. స్విస్ రిసార్ట్ డావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఇఎఫ్) వార్షిక సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. పాలస్తీనా దేశ ఏర్పాటుకు మార్గాన్ని రూపొందించలేకపోతే ఇజ్రాయిల్‌కు నిజమైన భద్రత రాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇజ్రాయిల్‌ను మధ్య ప్రాచ్యంలోకి తీసుకువచ్చినట్లైతే, ఇరాన్‌ను, అలాగే దాని మిత్రులను ఏకాకిని చేసేందుకు ఆ ప్రాంతమంతా ఒకటిగా అవుతుందని బ్లింకెన్ పేర్కొన్నారు. దీంట్లో చాలా క్లిష్టమైన, సవాలు చేసే నిర్ణయాలు వున్నాయన్నారు. ఇలాంటి వాటికి పారదర్శకమైన దృక్పథం అవసరమని అన్నారు. ఇజ్రాయిల్‌ను ఈ ప్రాంతంలోకి కలుపుకోవడంపై అరబ్, ముస్లిం నేతల వైఖరి విరుద్ధంగా వుందన్నారు. ప్రస్తుతం మధ్య ప్రాచ్యంలో నెలకొన్న అత్యవసర పరిస్థితుల్లో ఇది చాలా అవసరమై వుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇజ్రాయిల్‌కు భద్రతాపరమైన సాయాన్ని అందించడంపై షరతులు విధించాలని కోరుతున్న తీర్మానాన్ని అమెరికా సెనెట్ తిరస్కరించింది. మంగళవారం పొద్దుపోయిన తర్వాత సెనెటర్లు మెజారిటీ సంఖ్యలో ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. గాజాలో సాగిస్తున్న సైనిక ఆపరేషన్లలో మానవ హక్కుల ఉల్లంఘనలకు ఇజ్రాయిల్ పాల్పడిందా? లేదా? అని పరిశీలిస్తూ 30రోజుల్లోగా విదేశాంగ శాఖ నివేదిక ఇవ్వాలని, ఉల్లంఘనలకు పాల్పడితే ఇజ్రాయిల్‌కు భద్రతాపరమైన సాయాన్ని స్తంభింప చేయాలని ఆ తీర్మానం కోరుతోంది. వందమంది సభ్యులు గల సెనెట్‌లో ఆ తీర్మానాన్ని పక్కకు పెట్టాలంటూ 72మంది సెనెటర్లు ఓటు వేశారు. 11మంది మాత్రమే తీర్మానానికి మద్దతుగా ఓటు వేశారు.
వెస్ట్‌బ్యాంక్‌లో డ్రోన్ దాడులు, సైనిక బలగాల దాడి
ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయిల్ మిలటరీ డ్రోన్ దాడులను ముమ్మరం చేసింది. మరోవైపు పదాతి దాడులతో కూడా చెలరేగిపోతోంది. ఈ దాడుల్లో ఏడుగురు మరణించగా, అనేకమంది గాయపడ్డారు. ఖాన్ యూనిస్‌లోని తమి మిలటరీ ఫీల్డ్ ఆస్పత్రి తీవ్రంగా దెబ్బతిందని జోర్డాన్ ఆర్మీ ప్రకటించింది. ఇజ్రాయిలీ బందీలకు ఔషధాలను అందించడానికి ప్రతిగా గాజాలోకి మందులు, ఇతర సహాయాన్ని పంపించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఖతార్ తెలిపింది. ఇప్పటివరకు వరకు గాజాలో 24,448మంది మరణించగా, 61,504మంది గాయపడ్డారు. గాజాలో ప్రతి ఒక్కరూ ఆకలితో బాధ పడుతున్నారని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల నిపుణులు తెలిపారు. గాజాను దిగ్బంధించి, సహాయం అందకుండా చేయడంతో పరిస్థితుల దారుణంగా వున్నాయన్నారు. తుల్కారెమ్ శరణార్ధి శిబిరంపై తొమ్మిది గంటల నుండి ఏకధాటిగా దాడులు కొనసాగుతునే వున్నాయి. ఇజ్రాయిల్ సైనికులు ఇంటింటికీ తిరుగుతూ కనిపించిన వారందరిపై దాడి చేస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తలుపులు తెరవకపోతే బలవంతంగా బద్దలు కొట్టి మరీ లోపలకు ప్రవేశిస్తున్నారని చెప్పారు. మూకుమ్మడిగా బంధించి, పొలాల్లో వారిని విచారిస్తున్నారన్నారు.