హమాస్ ముఖ్య రాజకీయ నేత ఇస్మాయిల్ హనియే హత్యతో ఇజ్రాయిల్ మరోసారి బరితెగించింది. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ అధినేత అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశాలిచ్చినట్లు వచ్చిన నిర్ధారణగాని వార్తలు నిజమే అయితే మధ్య ప్రాచ్యంలో పరిణామాలు మరింత విషమించే అవకాశం ఉంది. ఒకే రోజు, బుధవారం నాడు హమాస్, హిజబుల్లా సంస్థల ప్రముఖ నేతలను ఇజ్రాయిల్ దళాలు హత్య చేశాయి. ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెషికియాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన హనియేను రాజధాని టెహరాన్‌లో హత్యచేశారు. అంతకు కొద్దిగంటల ముందు లెబనాన్ రాజధాని బీరూట్ నగరంలో హిజబుల్లా సీనియర్ మిలిటరీ కమాండర్ ఫాద్ షుకుర్‌ను ఇజ్రాయిల్ హత్యచేసింది. ఈ రెండు సంస్థలూ ఇరాన్‌కు గట్టి మద్దతుదారులే అన్న సంగతి తెలిసిందే. ఇజ్రాయిల్ ఆక్రమణలోని గోలన్ గుట్టల ప్రాంతంపై అంతకుముందు జరిగిన దాడికి కారణమని ఇజ్రాయిల్ ఆరోపించగా తమకేమీ సంబంధం లేదని హిజబుల్లా ప్రకటించింది. గాజాలో హమాస్ నేతలు, కార్యకర్తల అణచివేత పేరుతో సాగిస్తున్న మారణహోమంలో భాగం, శాంతి చర్చలను దెబ్బతీసే కుట్ర కారణంగానే హనియే హత్య అన్నది స్పష్టం.
గతేడాది అక్టోబరు ఏడు నుంచి గాజాలో మారణకాండతో పాటు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఇరాన్, అది మద్దతిస్తున్న సంస్థలను రెచ్చగొట్టి పూర్తి స్థాయి మధ్యప్రాచ్య యుద్ధంలోకి లాగాలన్నది ఇజ్రాయిల్ దానికి మద్దతు ఇస్తున్న అమెరికా, ఇతర పశ్చిమ దేశాల ఎత్తుగడ అన్నది తెలిసిందే. దాని వలలో పడకుండా ఇరాన్ ఇన్ని నెలలుగా సంయమనం పాటిస్తున్నది. ప్రతీకారం తీర్చుకోవాలని బుధవారం నాటి జాతీయ భద్రతా మండలి సమావేశంలో ఖమేనీ ఆదేశాలిచ్చినట్లుగా అధికారులు అనధికారికంగా చెప్పినట్లుగా గురువారం నాడు న్యూయార్క్ టైమ్స్ పత్రిక వార్త ఇచ్చింది. మంటను ఎగదోసేందుకు ఇలాంటి వార్తలను ప్రచారం చేయటం తెలిసిందే. ఒకటి మాత్రం స్పష్టం, తమకు ఎదురు లేదని, ఎవరిని కావాలంటే వారిని, ఎక్కడబడితే అక్కడ మట్టుబెట్టే సత్తా తమకుందని ఇజ్రాయిల్ తాజా హత్యల ద్వారా ఆ ప్రాంత, ప్రపంచ దేశాలకు సందేశమిచ్చింది. గత నెల చివరి వారంలో పాలస్తీనా విముక్తికోసం పోరాడుతున్న పద్నాలుగు సంస్థలు, పార్టీలు చైనా మధ్యవర్తిత్వంలో ఉమ్మడిగా పోరాడేందుకు, జాతీయ ప్రభుత్వ ఏర్పాటుకు ఒక ఒప్పందానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాన్ని అమెరికా, ఇజ్రాయిల్ జీర్ణించుకోలేకపోతున్నాయి. ఆ ఒప్పందంలో హమాస్, పశ్చిమ గట్టు ప్రాంతంలో అధికారంలో ఉన్న ఫతా పార్టీలు కీలకు భాగస్వాములు. ఈ రెండూ కలవకూడదని కోరుకుంటున్న ఇజ్రాయిల్‌కు అది శరాఘాతం మాదిరి తగిలింది. ఆ ఉక్రోశంతో టెహరాన్‌లో హమాస్ నేత హత్యకు పాల్పడి ఉండవచ్చు. దానికి ప్రతిగా యుద్ధం గాకపోయినా ఇజ్రాయిల్ మీద పరిమితదాడులు జరిగే అవకాశం లేకపోలేదు. అది ఇరాన్ నేరుగా చేస్తుందా లేక మద్దతు ఇస్తున్న హిజబుల్లా, ఎమెన్‌లోని హౌతీ సాయుధ సంస్థలతో చేయిస్తుందా అన్నది చూడాల్సి ఉంది.
హనియే హత్యను ఐరాస భద్రతా మండలి బుధవారం నాటి అత్యవసర సమావేశం ఖండించింది.దీని పర్యవసానాలు మధ్య ప్రాచ్యంలో పూర్తి స్థాయి యుద్ధానికి దారితీయకుండా చూడాలని కోరింది.హనియే హత్యను చైనా, రష్యా, అల్జీరియా నిర్ద్వందంగా నిరసించగా అమెరికా, బ్రిటన్,ఫ్రాన్స్ ఈ ప్రాంతంలో పరిస్థితులు దిగజారటానికి కారకులైన వారికి ఇరాన్ మద్దతు ఇవ్వటమే కారణమని ఎదురుదాడికి దిగాయి.తాము ఎంతో సంయమనంతో ఉన్నామని అయితే నిర్ణయాత్మకంగా హనియే హత్య మీద స్పందించేందుకు తమకు హక్కు ఉందని ఐరాసలో ఇరాన్ రాయబారి స్పష్టం చేశాడు. దీనికి ఇజ్రాయిల్‌తో పాటు అమెరికా కూడా బాధ్యత వహించాల్సిందే అన్నాడు.హత్యతో తమకేమీ సంబంధం లేదని, ఈ కారణంగా యుద్ధ అవసరం లేదని అమెరికా సన్నాయి నొక్కులు నొక్కింది. ఇరాన్ మీదే చర్యలు తీసుకోవాలంటూ దొంగే దొంగ అన్నట్లుగా ఇజ్రాయిల్ ఎదురుదాడికి దిగింది. అంతర్జాతీయ కోర్టులు తీర్పు చెప్పినా, యావత్ ప్రపంచం ఖండిస్తున్నా ఇజ్రాయిల్ ఖాతరు చేయటం లేదు. అడ్డగోలుగా భద్రతా మండలిలో అమెరికా ఇస్తున్న మద్దతు బయట అందిస్తున్న మిలిటరీ ఇతర సాయమే దాని దురాగతాలకు కారణం.ప్రపంచ శాంతి శక్తులు ఇప్పటి వరకు స్పందించింది ఒక ఎత్తు కాగా, మరింతగా రంగంలోకి దిగితేనే వాటికి అడ్డుకట్టపడుతుంది.