పశ్చిమాసియాను అగ్గికొలిమిగా మార్చిన ఇజ్రాయిల్‌

Israel turned West Asia into a furnaceగాజాపై ఇజ్రాయిల్‌ దురాక్రమణ యుద్ధానికి అక్టోబరు 7వ తేదీతో ఏడాది పూర్తవుతుంది. హమాస్‌ దాడిని ఒక సాకుగా చూపించి ఇజ్రాయిల్‌ గాజాపై మానవ మారణహోమం ప్రారంభించింది. హమాస్‌ను నిర్మూలించేందుకే తాను గాజాపై దాడి చేస్తున్నానని చెప్పింది. ఆ లక్ష్యం సాధించడం అటుంచి ఇజ్రాయిల్‌ ఈ రోజుకు వచ్చేసరికి మొత్తం పశ్చిమాసియాను అగ్గి కొలిమిగా మార్చింది. లెబనాన్‌, ఇరాన్‌, సిరియా, ఎమెన్‌, ఇరాక్‌లపై దాడికి ఒడిగడుతున్నది. ఇజ్రాయిల్‌ దురాక్రమణలో భాగంగా వేసే ప్రతి అడుగునూ బలపరుస్తూ అమెరికా గట్టిగా వత్తాసుదారుగా నిలిచింది. గత పక్షం రోజులలో లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ చేస్తున్న సైనిక దాడులు యుద్ధం స్వభావాన్నే మార్చేశాయి. ఒక పథకం ప్రకారం మొదలుపెట్టిన దాడిలో అది దక్షిణ లెబనాన్‌పై ముమ్మర వైమానిక దాడులకు దిగింది. పేజర్లు ఇతర సమాచార సాధనాలను ఉపయోగించి హిజ్బుల్లా నాయకుల హత్యలకు పాల్పడింది. సంస్థ కేంద్రంలో వున్న హిజ్బుల్లా ప్రధాన కార్యదర్శి హసన్‌ నస్రుల్లాను ఒక బంకర్‌ విధ్వంసక బాంబర్‌తో హత్య చేయడంతో యుద్ధం మరింత తీవ్రమైంది. దక్షిణ లెబనాన్‌పై ఒక పరిమిత స్థానిక లక్ష్య నిర్దేశిత భూతల యుద్ధం ప్రారంభిస్తున్నట్టు ఇజ్రాయిల్‌ అక్టోబర్‌ ఒకటిన ప్రకటించింది. అయితే వాస్తవంలో అది పూర్తి స్థాయి భూతల యుద్ధం కోసం లెబనాన్‌ సరిహద్దులలో భారీ సంఖ్యలో బలగాలను మొహరించింది.
ఇజ్రాయిల్‌ పశ్చిమాసియాలో ఒక దుష్ట రాజ్యం. అన్ని అంతర్జాతీయ చట్టాలనూ, ఒప్పందాలనూ ఉల్లంఘించి అది దేశ దేశాలలో పథకం ప్రకారం హత్యలు, దాడులు సాగిస్తున్నది. గత ఒక్కఏడాదిలోనే ఇజ్రాయిల్‌ ఇరానియన్‌ భూభాగంపై వైమానిక దాడులకు పాల్పడ్డం ద్వారా హమాస్‌ ప్రధాన ప్రతినిధి ఇస్మాయిల్‌ హనియే ప్రాణాలు తీసింది. నూతనంగా ఎన్నికైన ఇరాన్‌ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు వెళ్లిన హనియేను బలిగొన్న తర్వాత అది బీరుట్‌ను లక్ష్యంగా చేసుకుని నస్రుల్లాను హతమార్చింది. నస్రుల్లా హత్య తర్వాత హిజ్బుల్లా దాదాపు తుడిచి పెట్టుకు పోయినట్టేనని ఇజ్రాయిల్‌ ప్రకటించింది. అలాంటి దారుణమైన హూంకరింపులు వాస్తవానికి చాలా దూరంగా వుంటాయి.1992లో ఇజ్రాయిల్‌ హిజ్బుల్లా సహ వ్యవ స్థాపకుడు, రెండవ కార్యదర్శి అబ్బాస్‌ అల్‌ ముసావీని హత్య చేసినట్టు ప్రకటించింది.ఆ స్థానంలో నస్రుల్లా వచ్చాడు. తను రెండుసార్లు ఇజ్రాయిల్‌ సైన్యం దురాక్రమణను ప్రతిఘటించాడు. హిజ్బుల్లా చేతుల్లో రెండుసార్లు పరాజయం పాలైన తర్వాత 2006లో ఇజ్రాయిల్‌ తను అనుకున్న లక్ష్యం సాధించలేక పోయినట్టు అంగీకరించాల్సి వచ్చింది. ఇదివరకటి తన దుస్సా హసాలకు ఏ గతి పట్టిందో ఇజ్రాయిల్‌ మరచిపోయినట్టు కనిపిస్తుంది.
గత చరిత్ర చెబుతున్నదేమిటి?
పశ్చిమాసియాలో అమెరికాకు బలమైన స్థావరంగా వున్న ఇజ్రాయిల్‌ అమెరికా భాషనే మాట్లాడుతున్నది. ‘ఉధృతం నుంచి ఉపశమనం’ అంటూ అది తన సైనిక వ్యూహాన్ని ప్రకటించింది. ఇదో లోపభూయిష్టమైన అవగాహన, విఫల వ్యూహం. ఉధృత సైనిక దాడితో శత్రువు లొంగిపోవలసి వస్తుందనేది ఈ వ్యూహంలో వుండే ఆలోచన. అయితే ఈ వ్యూహం ప్రకారమే విజయాలు దక్కుతాయనే గ్యారంటీ ఏమీ లేదని చెప్పడానికి చరిత్రలో అనేక ఉదాహరణలున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌, సిరియా లిబియాలలో అమెరికా దారుణంగా ఓడిపోవడం చూశాం, ఇప్పుడూ ఇజ్రాయిల్‌కు అదే గతి పట్టబోతున్నది. హిజ్బుల్లా దళాలు తమ దాడులతో నిస్సహాయ స్థితిలో పడిపోయాయనీ, కనుక ఇరాన్‌ కూడా ఆ ప్రభావానికి గురై బలహీనంగా మారిందని యుద్ధోన్మాద ఇజ్రాయిల్‌ నాయకులు అంచనా వేస్తున్నారు. ఇరాన్‌పై సైనిక దాడులు జరగాలని, ఆ దేశ అణు కేంద్రాలనూ లక్ష్యంగా చేసుకోవాలనీ చెబతున్నారు.ఇరాన్‌లో ప్రభుత్వ మార్పు తీసుకురావడం గురంచీ, పశ్చిమాసియా రాజకీయ ముఖచిత్రం మార్పు గురించీ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ మాట్లాడుతున్నారు. ఈ విశృంఖల భావాలతో రెచ్చిపోయిన ఇజ్రాయిల్‌ పశ్చి మాసియాలో తన ఆధిపత్యం నెలకొల్పుకోవాలని నిర్యక్ష్యపూరితంగా ప్రయత్నిస్తోంది. అది అమెరికా ప్రయోజనాలకూ ఉపయోగకరమవుతుంది.
అమెరికా వత్తాసు వల్లనే..
ఇజ్రాయిల్‌ను నిలవరించడానికి తన ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఇరాన్‌ ఇప్పుడు ఆ దేశంపై 180కి పైగా మిసైళ్లను ప్రయోగించింది. తమ గగనతలంపై ఇజ్రాయిల్‌ దాడి చేశాక ఇరాన్‌ ప్రతీకారదాడి చేయడం ఇది రెండోసారి. అమెరికా నుంచి, దాని మిత్రదేశమైన బ్రిటన్‌ వంటి దేశాల నుంచి తిరుగులేని మద్దతు వల్లనే ఈ ప్రాంతంలో ఇజ్రాయిల్‌కు ధైర్యం వస్తున్నది. ఈ సంఘర్షణ ప్రతి దశలోనూ అమెరికా నుంచి ఇజ్రాయిల్‌కు మద్దతు లభిస్తూనే వుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మరే దేశానికీ ఇవ్వనంతగా 12,400 కోట్ల డాలర్ల సహాయం అందించింది. 2016 నుంచి చూస్తే దశాబ్ది సహాయం పథకంలో భాగంగా ఇజ్రాయిల్‌ ఏటా మొత్తం 3800 కోట్ల డాలర్ల సహాయం అందుకున్నది. గాజాపై ఇజ్రాయిల్‌ దాడి ప్రారంభించిన రోజున అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరింత సైనిక సహాయం అందిస్తామని వాగ్దానం చేశారు. పేలుడు పదార్థాలు, విధ్వంసక పరికరాలు అందించి ఇజ్రాయిల్‌ ఉక్కు చట్రాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. ఇజ్రాయిల్‌ రక్షణ బలగాలు మానవ హక్కుల హననానికి పాల్పడుతున్నారని వస్తున్న నివేదికలను బొత్తిగా పెడచెవిన పెట్టి అమెరికా ఆగష్టులో ఇజ్రాయిల్‌కు తమ దేశ సైనిక పరిరకాలను, ఆయుధాలను కొనుగోలు చేయడం కోసం 3500 కోట్ల డాలర్ల అదనపు సహా యం పంపించింది. గత ఒక్క ఏడాదిలోనే ఇజ్రాయిల్‌ ఆయుధ పాటవం పెంపు కోసం 1400 కోట్ల డాలర్ల సాయం లభిం చింది. వీటన్నిటినీ మించి అమెరికా ఇజ్రాయిల్‌కు మద్దతుగా యుద్ధ విమానాలు, క్షిపణి విధ్వంసక ఆయుధాలు తరలించింది. ఇరాన్‌ మిసైళ్లను తిప్పికొట్టడంలో తమ సైన్యం కీలకమైన వ్యూహాత్మక పాత్ర పోషించిందని అమెరికా ప్రకటించింది. బ్రిటన్‌ కూడా అలాంటి ప్రకటనే చేసింది. ఇజ్రాయిల్‌కు అమెరికా ఇన్ని విధాల ఆర్థిక, ఆయుధ సహాయం అందిస్తుంటే కాల్పుల విర మణకూ యుద్ధ ప్రజ్వలన చల్లార్చడానికి ప్రయత్నిస్తున్నాని మాట్లాడటం కేవలం కంటి తుడుపు, పసలేని పల్లవి మాత్రమే.
వంత పాడుతున్న మోడీ
పాలస్తీనాతో సంఘీభావం అనే విధానం నుంచి వైదొలగిన భారత ప్రభుత్వం అమెరికాకు, ఇజ్రాయిల్‌కు కూడా వ్యూ హాత్మక భాగస్వామిగా వుంది. పన్నెండు నెలల్లోగా అన్ని ఆక్రమిత ప్రాంతాల నుంచి వైదొలగాలని ఇజ్రాయిల్‌ను ఆదేశిస్తూ ఐక్యరాజ్య సమితి ముందుకొచ్చిన తీర్మానంపై ఓటింగులో పాల్గొనకుండా వుండిపోయింది. ఇజ్రాయిల్‌ పథకం ప్రకారం హత్యలు చేయించడాన్ని ఖండించే బదులు భారత ప్రభుత్వం మౌనంగా వుండిపోయింది. నెతన్యాహూతో జరిపిన ఫోన్‌ సంభాషణలో ప్రధాన మంత్రికి టెర్రరిజాన్ని ఖండించేందుకు సమయం దొరికింది గానీ గాజా, లెబనాన్‌లపై ఇజ్రాయిల్‌ మారణ యుద్ధాన్ని ఖండించేందుకు ధైర్యం కూడగట్టుకోలేక పోయారు. భారత సైనిక దళాల ప్రధానాధికారి ఇజ్రాయిల్‌ పేజర్‌ బాంబులను గొప్ప దెబ్బగా ప్రశంసించారేగాని అలాంటి దాడులను ఖండించలేదు. అత్యంత లజ్జావిహీనమైన రీతిలో ప్రభుత్వం పేలుడు పదార్థాల, విడిభాగాల రవాణాను అనుమతిస్తున్నది. భారత్‌లో తయారైన డ్రోన్లను పాలస్తీని యన్లపై ప్రయోగించడానికి ఒప్పుకొంటున్నది. ఆక్రమిత ప్రాంతాల హక్కుల కోసం నిలబడే స్థితి నుంచి ఆక్రమణదార్ల వైపున నిలిచేవిధంగా మన విదేశాంగ విధానంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఎంతటి మార్పు తీసుకొచ్చిందో వీటన్నిటినీ బట్టి విదితమవుతుంది.
పాలస్తీనియన్లకు సంఘీభావం
ఇజ్రాయిల్‌ దురాక్రమణ ప్రపంచ శాంతికి ముప్పుగా మారే ప్రమాదకర దశకు చేరుకున్నది. ఇది మరెంత మాత్రం తీవ్రతరమైనా సర్వ వినాశనకరమవుతుంది. వెంటనే కాల్పుల విరమణ చేయాలని కోరుతూ ప్రపంచ వ్యాపితంగా ప్రజలు ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా సమీకృతమవుతున్నారు. ఆయు ధాలను తరలించడానికి గానీ, వాటిని చేరవేసే పడవలు రేవులో దిగడానికి గానీ వారు అనుమతించడం లేదు. ఇజ్రాయిలీ యూని వర్సిటీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవలసిం దిగా తమ దేశంలో విద్యాలయాలపై విద్యార్థులు ఒత్తిడి తెస్తున్నారు. అలాంటి ప్రతిఘటన కార్యక్రమాలను మన దేశంలోనూ బలోపేతం చేయాలి. మన ప్రభుత్వంపై ఇజ్రాయిల్‌కు ఆయుధాల సరఫరా నిలిపివేసి పాలస్తీనియన్లకు సంఘీభావంగా నిలిచే పరిస్థితి తీసుకురావాలి.
(అక్టోబరు2 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)