ఇజ్రాయిల్‌ యుద్ధ నేరాలు

– మిలిటరీ దాడుల్లో నల్గురు పిల్లలతో సహా 13 మంది పాలస్తీనీయుల మృతి
– పలు దేశాల ఖండన
జెరూసలేం : జెనిన్‌లో ఇజ్రాయిల్‌ యుద్ధ నేరాలతో మానవతా విపత్తును సృష్టించింది. వెస్ట్‌బాంక్‌ ఉత్తర ప్రాంతంలోని జెనిన్‌ పట్టణంపై ఇజ్రాయిల్‌ ఇటీవలి సంవత్సరాల్లో ఎన్నడూ లేని రీతిలో అతి పెద్ద దాడికి సోమవారం పాల్పడింది. వైమానిక దాడులు, కాల్పులతో గత రెండు రోజులుగా జెనిన్‌ పట్టణం నెత్తురోడింది. పాటు ఇజ్రాయిల్‌లోని పచ్చి మితవాద నెతన్యాహు ప్రభుత్వం సాగించిన ఈ భయానక దాడిలో నలుగురు పిల్లలతో సహా 13 మంది చనిపోయారు. కనీసం 120 మంది గాయపడ్డారు. వీరిలో 20 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సొంత గడ్డపై శరణార్థులుగా మారిన పాలస్తీనీయులను శిబిరాల్లో నుంచి తరిమేసేందుకు ఇజ్రాయిల్‌ సైన్యం తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించింది. దీంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పాలస్తీనా భూ భాగాలను అక్రమంగా ఆక్రమించుకోవడమే గాక, వారి ఆయుధాలను, వారి జీవనోపాధిని కూడా లాగేసుకోవడం, పాలస్తీనా పౌరులపై మిలిటరీ దుర్మార్గంగా దాడులకు దిగడం అంతర్జాతీయ న్యాయ నియమాలను, మానవ హక్కులను తుంగలో తొక్కడమేనని పలు దేశాలు ఇజ్రాయిల్‌ చర్యను ఇరాన్‌, లెబనాన్‌, సిరియా, మొరాకోతో సహా పలు దేశాలు ఖండించాయి. ఇజ్రాయిల్‌లో మితవాద ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు నెరపుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలస్తీనీయులపై ఇంత ఘోరం జరుగుతున్నా కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటు అని పలువురు విశ్లేషకులు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా జెనిన్‌ పట్టణం నుండి ఇజ్రాయిల్‌ బలగాలు వైదొలగాయని నెతన్యాహు ప్రభుత్వం బుధవారం తెలిపింది. ప్రస్తుతానికి ఈ ఆపరేషన్‌ను ముగిస్తున్నామని, జెనిన్‌లో విస్తృత సైనిక చర్య అనేది ఒకసారికి సంబంధించినదిగా చెప్పలేమని నెతన్యాహు అన్నారు.. జెనిన్‌ శివార్లలో మిలటరీ శిబిరాన్ని ఆయన బుధవారం సందర్శించారు. 2022 ప్రారంభం నుండి వెస్ట్‌ బ్యాంక్‌లో దాదాపుగా ప్రతి రోజూ ఇజ్రాయిల్‌ దాడులకు తెగబడుతూనే వుంది. 56ఏళ్ళ ఆక్రమణ ఫలితమే ఈ హింస అని పాలస్తీనియన్లు విమర్శిస్తున్నారు.