ఇజ్రాయిల్‌ దురహంకార దాడులు ఆపాలి

పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాలి – పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాలి 
– ప్రపంచమంతా అండగా నిలబడాలి : వామపక్షాల సంఘీభావ సభలో ఆంధ్రజ్యోతి సంపాదకులు శ్రీనివాస్‌
– ఎస్వీకే నుంచి అంబేద్కర్‌ కాలేజీ వరకు ప్రదర్శన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దురహంకార దాడులను వెంటనే ఆపాలని ఆంధ్రజ్యోతి సంపాదకులు కె శ్రీనివాస్‌ అన్నారు. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాలనీ, దాని సార్వభౌమత్వాన్ని కాపాడాలని కోరారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పాలస్తీనా సంఘీభావ సభను మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం(ఎస్వీకే)లో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఇజ్రాయిల్‌ సాగిస్తున్న జాత్యాహంకార విధానాన్ని తీవ్రంగా ఖండించారు. పాలస్తీనాపై జరుగుతున్న దాడిని మానవతా కోణంలో చూస్తామా?, రాజకీయ కోణంలో చూస్తామా?అని అన్నారు. అక్కడ మహిళలు, పిల్లలు, వృద్ధులు చనిపోయారనీ, వారికి ప్రపంచమంతా సానుభూతి వ్యక్తం చేయాలన్నారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడులు ఆపాలంటూ ఐక్యరాజ్యసమితిలో 140 దేశాలు తీర్మానం చేశాయని గుర్తు చేశారు. అయితే ఇందులో భారత్‌ పాల్గొనలేదనీ, ఇది అవమానకరమని చెప్పారు. గతంలో న్యాయం పట్ల, బాధితుల పక్షాన భారత్‌ నిలబడేదని గుర్తు చేశారు. మోడీ ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. అయితే పాలస్తీనా ఉనికి లేకుండా చేసేందుకు ఇజ్రాయిల్‌ దాడులకు పాల్పడుతున్నదని అన్నారు. బాధితుల పక్షాన నిలబడాలనీ, వారికి అందరూ సంఘీభావంగా ఉండాలని కోరారు. అధ్యక్షత వహించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి నరసింహారావు మాట్లాడుతూ ఇజ్రాయిల్‌ అమానుషంగా గాజాపై దాడులు చేస్తున్నదని విమర్శించారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు. ప్రజలంతా పాలస్తీనాకు సంఘీభావంగా ఉండాలనీ, భారత్‌లో రాజకీయాలకతీతంగా ప్రజలు అండగా ఉండాలని కోరారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్‌ మాట్లాడుతూ కాల్పుల విరమణ చేయబోమంటూ ఇజ్రాయిల్‌ ప్రకటించడం దుర్మార్గమని విమర్శించారు. హమాస్‌ను పెంచిపోషించిన ఇజ్రాయిల్‌ ఇప్పుడు దాన్ని అంతం చేయాలనుకుంటున్నదని చెప్పారు. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నించాలని సూచించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌పాషా మాట్లాడుతూ పాలస్తీనా ప్రజలు ప్రమాదకర పరిస్థితుల్లో బతుకుతున్నారని అన్నారు. పాలస్తీనావాసులను నిర్మూలించి వలసవాదులు గాజాను ఆక్రమించాలని చూస్తున్నారని చెప్పారు. సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె గోవర్ధన్‌, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి సిహెచ్‌ మురహరి, ఆర్‌ఎస్‌పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాదం అండతో పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడులు చేస్తున్నదని విమర్శించారు. పాలస్తీనా భూభాగం నుంచి ఇజ్రాయిల్‌ వెళ్లిపోవాలని డిమాండ్‌ చేశారు. సాధారణ ప్రజలపై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న మారణహోమాన్ని అందరూ ఖండించాలన్నారు. అనంతరం ఎస్వీకే నుంచి అంబేద్కర్‌ కాలేజీ వరకు ప్రదర్శన నిర్వహించారు. ‘ఇజ్రాయిల్‌ యుద్ధోన్మాదం నశించాలి, పాలస్తీనా ప్రజల పోరాటం వర్ధిల్లాలి, పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాలి, పాలస్తీనాకు ప్రజలు అండగా నిలబడాలి’అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.