న్యూయార్క్ : గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయిల్ మంగళవారం చేసిన దాడిలో 400మంది చనిపోవటం దారుణమని ఐక్యరాజ్య సమితి మానవతా విషయాల అండర్ సెక్రటరీ మార్తిన్ గ్రిఫ్పిత్ అన్నారు. అనేక వేలమందితో కిటకిటలాడే శరణార్థి క్యాంపుపైన ఇజ్రాయిల్ దాడి చేయటం అత్యంత హేయమైన చర్య అని పలు దేశాలు అభివర్ణించాయి. ఒక ముఖ్యమైన హమాస్ కమాండర్ లక్ష్యంగా ఇజ్రాయిలీ రక్షణ దళాలు చేసిన దాడిలో సాధారణ పౌరులు మరణించటం విచారకరమని, అందుకు హమాస్ బాధ్యతవహించాలని ఇజ్రాయిలీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఇజ్రాయిల్‌ను, ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాన్ని రెండు రోజులపాటు సందర్శించిన తరువాత గాజాపైన ఇజ్రాయిల్ చేస్తున్న దాడి ఒక నూతన దశకు చేరుకుందనీ, దానితో భయానకమైన మానవతా పర్యవసానాలు ఉంటాయని గ్రిఫ్పిత్ అన్నారు. అక్టోబర్7 తరువాత అనేక లక్షల మంది మనసులో మాయని మచ్చలు ఏర్పడతాయని చెప్పారు. ఆ రోజున హమస్ చేసిన దాడిలో 1400మంది ఇజ్రాయిలీ ప్రజలు చనిపోయారు. అందుకు ప్రతిగా ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల్లో ఇప్పటివరకు 8600మంది పాలస్తీనా వాసులు చనిపోయారని గాజా ఆరోగ్య సంరక్ష శాఖ అధికారులు తెలిపారు. గాజాలో ఇజ్రాయిల్ చేస్తున్నది ”టెక్ట్స్ బుక్ లో రాసినట్టు జరుగుతున్న మారణకాండ” అని న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయ డైరెక్టర్ క్రెయిగ్ మొకైబర్ వర్ణించాడు. ఐక్యరాజ్య సమితి అమెరికా ఆధిపత్యానికి లొంగిపోయిందని, పాలస్తీనా వాసులను చంపటాన్ని ఆపలేకపోయిందని ప్రకటిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేశాడు. గాజాలో కాల్పుల విరమణకు అమెరికాకు ఏమాత్రం ఆసక్తిలేదు. ఇజ్రాయిల్ చేస్తున్న మానవ హననాన్ని పట్టించుకోకుండా అమెరికా నిస్సిగ్గుగా ఇజ్రాయిల్ సమర్థించటమే కాదు సైనికంగా కూడా క్రియాశీలంగా ఉంది.