
– 350కిపైగా వైమానిక దాడులు
– సిరియా నేవీ విధ్వంసం
– దేశం లోపలకు చొచ్చుకుపోయిన ఇజ్రాయిల్ బలగాలు
డమాస్కస్ : సిరియా వ్యాప్తంగా ఇజ్రాయిల్ భారీగా విధ్వంసానికి తెగబడుతోంది. సిరియా భూభాగం లోపలకు ఇజ్రాయిల్ బలగాలు చొచ్చుకుపోయాయని సిరియా ప్రతిపక్ష యుద్ధ పర్యవేక్షక సంస్థ తెలిపింది. సిరియా నావికాదళాన్ని మొత్తంగా నాశనం చేశామని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ప్రకటించారు. దక్షిణ సిరియాలో నిస్సైనికీకరణ మండలాన్ని ఏర్పాటు చేస్తామని రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కట్జ్ పేర్కొన్నారు. సిరియాలో తీవ్రవాదం వేళ్ళూనుకోకుండా నివారించేందుకే ఈ చర్యలని చెప్పారు. అసద్ పంథాను ఎవరు అనుసరించినా వారికి అసద్‌కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. అసద్‌ను పదవీచ్యుతుడిని చేసిన తర్వాత బఫర్ జోన్‌లోకి ప్రవేశించామని ఇజ్రాయిల్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఆ ప్రాంతాన్ని దాటి ఇంకా ముందుకెళ్లాయా లేదా అనేది స్పష్టంగా తెలియరాలేదు. ఈ బఫర్ జోన్‌ను 50ఏళ్ళ క్రితం ఏర్పాటు చేశారు. అయితే రాజధాని డమాస్కస్ లోపలకు చొచ్చుకు వెళ్ళామనడాన్ని ఇజ్రాయిల్ తిరస్కరిస్తోంది. గత 48గంటల్లో 350కి పైగా వైమానిక దాడులకు పాల్పడ్డామని మిలటరీ ప్రకటించింది. దేశంలోని వ్యూహాత్మక ఆయుధ నిల్వల కేంద్రాలను చాలావరకు ధ్వంసం చేసేశామని తెలిపింది. తీవ్రవాదుల చేతుల్లోకి ఆ ఆయుధాలు వెళ్ళకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ దాడులు జరిపామంటూ సమర్ధించుకుంది. సిరియా నావికాదళానికి చెందిన రెండు నౌకాశ్రయాలపై ఒకేసారి క్షిపణి నౌకలతో దాడి చేశామని మిలటరీ తెలిపింది. అక్కడ మొత్తంగా 15నౌకలు వున్నాయని పేర్కొంది. అయితే వాటిల్లో ఎన్ని నౌకలపై దాడి చేశామన్నది వివరించలేదు. సోవియట్ శకానికి చెందిన ఆరు క్షిపణి నౌకలు దాడికి గురయ్యాయని ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థ అంబ్రే వెల్లడించింది.
కాగా ప్రస్తుతం సిరియాలో ఎక్కువ భాగాన్ని నియంత్రిస్తున్న హయత్ తహ్రీర్ అల్ షామ్ (హెచ్‌టిఎస్) నేతృత్వంలోని తీవ్రవాద గ్రూపుల నుండి ఎలాంటి స్పందన వెలువడలేదు. రెబెల్ అలయన్స్ ఏర్పాటు చేసే సాల్వేషన్ గవర్నమెంట్‌కు నాయకత్వం వహించే మహ్మద్ అల్ బషీర్ సారధ్యంలోని కొత్త కేబినెట్‌కు పాత ప్రభుత్వ సభ్యులు క్రమంగా అధి కారాలను బదిలీ చేస్తారు. మార్చి ప్రారంభం వరకు ఈ బదిలీ కొనసాగుతుందని బషీర్ విలేకర్లకు చెప్పారు. మరోవైపు రాజధాని డమాస్కస్‌లో జన జీవితం నెమ్మదిగా సాధారణ స్థాయికి వస్తోంది. అన్ని దుకాణాలు, కార్యాలయాలు తెరుచుకుంటున్నాయి.
దేశాన్ని పునర్నిర్మిస్తాం : తాత్కాలిక ప్రధాని హామీ
సిరియాను మొత్తంగా పునర్నిర్మిస్తామని తాత్కాలిక కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బషీర్ హామీ ఇచ్చారు. అయితే నగదు సంక్షోభం తీవ్రంగా వుందని వ్యాఖ్యానించారు. లక్షల సంఖ్యలోని శరణార్దులందరినీ వెనక్కి రప్పిస్తామని చెప్పారు. పౌరులందరికీ రక్షణ కల్పిస్తామని, మౌలిక సేవలందిస్తామని హామీ ఇచ్చారు. విదేశీ కరెన్సీ కొరత చాలా తీవ్రంగా వున్నందున కష్టం కాగలదన్నారు. 35వేల సిరియన్ పౌండ్లు పెడితే ఒక్క డాలరును కొనుగోలు చేయగలమని చెప్పారు. ఇక రుణాలు, బాండ్ల గురించి డేటా సేకరిస్తున్నామని చెప్పారు. ఆర్థికంగా అయితే పరిస్థితి చాలా అధ్వాన్నంగా వుందన్నారు.
పథకం ప్రకారమే అసద్ ప్రభుత్వ కూల్చివేత : ఖమేని
అమెరికా, ఇజ్రాయిల్ ఒక ప్రణాళిక ప్రకారమే అసద్ ప్రభుత్వాన్ని కూల్చివేశారని ఇరాన్ మత పెద్ద ఆయతుల్లా అలీ ఖమేని బుధవారం వ్యాఖ్యానించారు. సిరియా పొరుగుదేశాల్లో ఒకరికి కూడా ఇందులో పాత్ర వుందన్నారు. ఆ దేశం పేరును ఆయన వెల్లడించలేదు. అయితే అసద్ వ్యతిరేక రెబెల్స్‌కు మద్దతిచ్చే టర్కీ గురించే ఆయన ప్రస్తావిస్తున్నట్లు కనిపిస్తోంది. మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయిల్, అమెరికా ప్రాబల్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించే రాజకీయ, సైనిక ప్రతిఘటనా కూటమికి అసద్ ప్రభుత్వం కూలిపోవడమనేది పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ”సిరియాలో చోటు చేసుకున్న పరిణామాలన్నీ అమెరికా, ఇజ్రాయిల్ కమాండ్ రూమ్‌ల్లో పథకం ప్రకారం రచించినవే. ఇందుకు మా దగ్గర సాక్ష్యాధారాలున్నాయి. సిరియా పొరుగు ప్రభుత్వం కూడా ఇందులో పాలు పంచుకుంది.” అని ఖమేని తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలను ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. సిరియా కుర్దిష్ వైపిజి మిలీషియాకు వ్యతిరేకంగా సరిహద్దుల్లో పోరాడుతూ ఉత్తర సిరియాలో కొంత భూభాగాన్ని ఆక్రమించుకున్న టర్కీ, సిరియా రెబెల్స్‌కు ప్రధాన వెన్నుదన్నుగా వుంది. 2011లో సిరియాలో అంతర్యుద్ధం చెలరేగినప్పటి నుండి అసద్ ప్రభుత్వాన్ని కూల్చివేయాలన్నది టర్కీ లక్ష్యంగా వుంది. మరోవైపు యుద్ధ సమయంలో అసద్ ప్రభుత్వ రక్షణ కోసం ఇరాన్ వందల కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. రక్షణ కోసం తన రివల్యూషనరీ గార్డులను సిరియాలో మొహరించింది. అసద్ ప్రభుత్వం కూలిపోయిన గంటల వ్యవధిలో ఇరాన్ స్పందిస్తూ దూరదృష్టితో, వివేచనా దృక్పథంతో కూడిన సంబంధాలను డమాస్కస్‌తో కొనసాగించాలని భావిస్తున్నట్లు వ్యాఖ్యానించింది. సిరియా సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించేలా ప్రభుత్వ ఏర్పాటు జరగాలని పిలుపిచ్చింది.