– 55 మంది మృతి, వందలాదిగా క్షతగాత్రులు
– అల్ అక్సా ఆస్పత్రిలో హృదయ విదారక ఘటనలు
గాజా : అడ్డూ అదుపు లేకుండా వైమానిక, భూతల, సముద్ర దాడులతో గాజాపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. విరామం లేకుండా కొనసాగుతున్న ఈ దాడులతో పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారని, వందల సంఖ్యలో క్షతగాత్రులవుతున్నారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శనివారం డజన్ల సంఖ్యలో వైమానిక దాడులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా సెంట్రల్ గాజాలోని డేర్ అల్ బాలా ప్రాంతం వణికిపోయింది. అలాగే రఫాపై, ఉత్తర గాజాలోని పలు ప్రాంతాలపై కూడా దాడులు కొనసాగాయి. మరణించినవారి మృతదేహాలను అల్ అస్పత్రికి తీసుకువస్తున్నారని, అలాగే గాయపడిన వారు కూడా మెజారిటీ సంఖ్యలో ఇక్కడకే వస్తున్నారని, వీరిలో ఎక్కువమంది మహిళలు, పిల్లలే వున్నారని వైద్య బృందాలు తెలిపాయి. అయితే ఇంతమంది రావడంతో ఆస్పత్రిలో పడకలు చాలక నేలపైనే పడుకోబెట్టాల్సి వస్తోందని చెప్పారు. డజన్ల సంఖ్యలో ప్రజలు గాయాలతో బాధపడుతూ నేలపై ఎక్కడబడితే అక్కడ పడివుండడం కనిపిస్తోంది. తమ దగ్గర వున్న ప్రాధమిక సదుపాయాలతోనే వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని డాక్టర్లు పేర్కొంటున్నారు. మందులు, ఆక్సిజన్, ఆహారం, ఇలా ఏవీ అందుబాటులో లేవని మరీ ముఖ్యంగా ఇంధనం కొరతతో ప్రధాన జనరేటర్ ఆగిపోయిందని చెప్పారు. అల్ అక్సా మార్టియర్స్ ఆస్పత్రి ప్రతినిధి ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, డేర్ అల్ బాలాV్‌ాపై దాడి తర్వాత ఇక్కడకు వచ్చిన వారిలో 55మంది మరణించారని, డజన్ల సంఖ్యలో గాయపడినవారు చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇంకా వీధుల్లో పలు మృత దేహాలు పడివున్నాయని, క్షతగాత్రులు కూడా వున్నారని చెప్పారు. భీకరంగా దాడులు కొనసాగు తుండడంతో కమ్యూనికేషన్ సంబంధాలు కూడా దారుణంగా దెబ్బతి న్నాయి. భయకంపితులైన ప్రజలు ఎక్కడకు వెళ్ళాలో తెలియక దిక్కుతోచక వీధుల్లో తిరుగుతుండడం కనిపిస్తోందని మీడియా వార్తలు తెలిపాయి. ప్రతి నిముషానికి ఒకో పేలుడు వినిపిస్తోంది. అంబులెన్సులు బిజీగా రోడ్లపై తిరుగు తున్నాయి. ఆస్పత్రిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ఆ వార్తలు పేర్కొన్నాయి.