పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ ఊచకోతను ఆపాలి

– ఐదు వామపక్షాల డిమాండ్‌
న్యూఢిల్లీ : పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ మారణకాండను తక్షణమే ఆపాలని ఐదు వామపక్ష పార్టీలు సీపీఐ(ఎం), సీపీఐ, ఏఐఎఫ్‌బీ, సీపీిఐ(ఎంఎల్‌)-లిబరేషన్‌, ఆర్‌ఎస్‌పీలు డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు నాలుగు పార్టీల నేతలు సీతారాం ఏచూరి, డి.రాజా, జి.దేవరాజన్‌, దీపాంకర్‌ భట్టాచార్య, మనోజ్‌ భట్టాచార్యలు ఒక ప్రకటన జారీ చేశారు. కాల్పుల విరమణ జరిపి, మారణకాండను ఆపితేనే పరిష్కార మార్గం దొరుకుతుందని వారు స్పష్టం చేశారు. అమెరికా-ఇజ్రాయిల్‌ జరుపుతున్న ఊచకోతను సమర్ధించడాన్ని ఆపాలంటూ వామపక్ష పార్టీలు మోడీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. అమెరికా, భారత్‌ విదేశాంగ, రక్షణ మంత్రులు జరిపిన ముఖాముఖి చర్చల్లో గాజాకు మానవతా సాయం అందించడం కోసం కాల్పులకు విరామం ఇవ్వాలంటూ కోరారు. రెండు దేశాల ఏర్పాటే పరిష్కార మార్గమని భారత్‌ ఆ సమావేశాల్లో పునరుద్ఘాటించింది. అయితే, ఈ సమావేశాల్లో కాల్పుల విరమణకు పిలుపివ్వకుండా విరామం కోసం పిలుపివ్వడమంటే ఇప్పటికే కొనసాగుతున్న ఇజ్రాయిల్‌ మారణకాండను చట్టబద్ధం చేయడమే అవుతుందని వామపక్షాల నేతలు పేర్కొన్నారు. ఇజ్రాయిల్‌ అడ్డూ అదుపు లేకుండా సాగిస్తున్న బాంబు దాడులు, కాల్పులు చూస్తుంటే పాలస్తీనియన్లు వారి స్వంత దేశంలోనే జీవించేందుకు అవకాశం లేకుండా చేస్తున్నాయన్నారు. ఇప్పటికే 10వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. వారిలో దాదాపు సగం మంది చిన్నారులే, అత్యంత ఆటవికమైన, క్రూరమైన ఈ దాడుల్లో ఆస్పత్రులపై కూడా బాంబు దాడులు జరిగాయని వారు పేర్కొన్నారు. తక్షణమే కాల్పుల విరమణ జరపాలని వామపక్షాల నేతలు డిమాండ్‌ చేశారు.