– 22,030 బాండ్లను నగదుగా మార్చుకున్న పార్టీలు
– సుప్రీంకోర్టులో ఎస్‌బీఐ అఫిడవిట్
– రెండు పీడీఎఫ్ ఫైల్స్‌ను పెన్‌డ్రైవ్‌లో ఇచ్చామని వివరణ
– యూనిక్ కోడ్‌పై మౌనం
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత ఎస్‌బీఐ ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం ఎన్నికల బాండ్లకు సంబంధించిన సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌కు అందజేసింది. ఈ విషయాన్ని బుధవారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ రూపంలో తెలియజేసింది. ఓ పెన్‌డ్రైవ్‌లో ఎన్నికల కమిషన్‌కు వివరాలు ఇచ్చానని అందులో తెలిపింది. ఈ సమాచారం రెండు పీడీఎఫ్ ఫైల్స్‌లో ఉన్నదని, వాటికి పాస్‌వర్డ్ రక్షణ ఉన్నదని వివరించింది. 2019 ఏప్రిల్ నుంచి ఈ సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీ వరకూ (ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తేదీ) 22,217 బాండ్లు జారీ చేశానని ఎస్‌బీఐ తన అఫిడవిట్‌లో పేర్కొంది. వీటిలో రాజకీయ పార్టీలు 22,030 బాండ్లను నగదుగా మార్చుకున్నాయని చెప్పింది. నిబంధనల ప్రకారం మిగిలిన 187 బాండ్లను నగదుగా మార్చి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధిలో జమ చేశామని తెలిపింది. రద్దయిన ఎన్నికల బాండ్ల పథకం కింద దాతలు ఏదైనా రాజకీయ పార్టీకి విరాళం అందించేందుకు ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. అయితే ఆయా పార్టీలు వాటిని పదిహేను రోజులలో నగదుగా మార్చుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఆ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి జమ చేస్తారు.
కాగా ఎన్నికల బాండ్లను ఎవరు కొనుగోలు చేశారు? ఏ తేదీన కొనుగోలు చేశారు? వాటి విలువ ఎంత? ఆ బాండ్లను ఏయే రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్నాయి? ఏ తేదీన మార్చుకున్నాయి? వాటి విలువ ఎంత? వంటి వివరాలన్నింటినీ ఎన్నికల కమిషన్‌కు అందజేశానని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఎస్‌బీఐ తెలిపింది. అయితే ఎన్నికల బాండుపై ఉన్న యూనిక్ కోడ్ విషయాన్ని మాత్రం అందులో ప్రస్తావించలేదు. పార్టీలకు అందిన ప్రతి విరాళాన్నీ ఈ యూనిక్ కోడ్‌తో సరిపోల్చాల్సి ఉంటుంది.
ఎస్‌బీఐ అందజేసిన పీడీఎఫ్ ఫైల్స్‌ను పరిశీలించడానికి ఒక కమిటీని నియమించే అవకాశం ఉన్నదని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. ఎస్‌బీఐ అందజేసిన ఫార్మట్‌లోనే సమాచారాన్ని ఈసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామని చెప్పాయి. ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు జమ్మూకాశ్మీర్ పర్యటనకు వెళ్లిన ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ గురువారం ఉదయం ఢిల్లీలోని కార్యాలయానికి చేరుకుంటారు.
లేఖ రాసేందుకు ఆయనకు అధికారం ఇవ్వలేదు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వివరణ
ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అదిష్ అగర్వాల రాసిన లేఖ గందరగోళం సృష్టించిన నేపథ్యంలో ఆ సంఘం వివరణ ఇచ్చింది. రాష్ట్రపతికి లేఖ రాసేందుకు తాము అగర్వాలకు అధికారం ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల వ్యవహారంపై న్యాయస్థానం మరోసారి విచారణ జరిపే వరకూ సుప్రీంకోర్టు తీర్పును నిలిపివేయాలని మంగళవారం ముర్ముకు రాసిన లేఖలో అగర్వాల విజ్ఞప్తి చేశారు.
‘రాజ్యాంగపరమైన ప్రతిష్టంభనను కలిగించే విధంగా తీర్పులు వెలువరించడానికి సుప్రీంకోర్టును అనుమతించకూడదు. పార్లమెంట్ ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా తీర్పులు ఇవ్వడాన్ని అనుమతించకూడదు. పార్లమెంటులో ప్రజాప్రతినిధులందరూ కలిసి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వడాన్ని అనుమతించకూడదు. రాజకీయ పార్టీల పనితీరును ప్రశ్నించేలా తీర్పులు ఇవ్వకూడదు’ అని ఆయన ఆ లేఖలో అభిప్రాయపడ్డారు. వివిధ రాజకీయ పార్టీలకు విరాళాలు అందించిన కార్పొరేట్ సంస్థల వివరాలను బహిర్గతం చేస్తే అవి కక్షసాధింపు చర్యలకు గురయ్యే అవకాశం ఉన్నదని తెలిపారు.
ఈ లేఖపై బార్ అసోసియేషన్ స్పందిస్తూ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ ఛైర్మన్ హోదాలో అగర్వాల ఈ లేఖ రాసినట్లు కన్పిస్తోందని తెలిపింది. అయితే కమిటీ సభ్యులు ఆయనకు అలా లేఖ రాసే అధికారం ఇవ్వలేదని, అంతేకాక ఆ లేఖలో ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలను వారెవ్వరూ సమర్ధించడం లేదని స్పష్టం చేసింది. అగర్వాల్ చర్య, ఆయన రాసిన లేఖలోని వివరాలు సుప్రీంకోర్టు అధికారానికి భంగకరంగా ఉన్నాయని, ఈ చర్యను తాము నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నామని బార్ అసోసియేషన్ ఆ తీర్మానంలో తెలియజేసింది.