న్యూఢిల్లీ : దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం, జారీ భారీగా పెరుగుతోంది. 2024 డిసెంబర్‌లో కొత్తగా 8,20,000 క్రెడిట్ కార్డులు జారీ అయినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. అంతక్రితం నవంబర్‌లో కొత్తగా 3.50 లక్షల కార్డులు జారీ అయ్యాయి. గడిచిన నెలలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అత్యధికంగా 3.12 లక్షల కార్డులను అందించగా.. ఎస్బీఐ కార్డ్స్ 2.09 లక్షల కార్టులను వినియోగదారులకు అందించింది. ఆ తర్వాత స్థానంలో ఐసీఐసీఐ బ్యాంక్ 1.50 లక్షల కార్డులు జారీ చేసింది. పెండ్లిండ్ల సీజన్, ఏడాది ముగింపు పండగల సమయంలో ఖర్చులు అధికమవడం ఈ కార్డుల పెరుగుదలకు కారణమైందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2024 డిసెంబర్‌లో క్రెడిట్ కార్డుల వ్యయాలు దాదాపు 11 శాతం పెరిగి రూ.1.9 లక్షల కోట్లకు చేరుకున్నాయి.