నవతెలంగాణ – ఆళ్ళపల్లి : హైదరాబాద్ అసెంబ్లీలోని తన ఛాంబర్ లో ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మంగళవారం తన చేతులు మీదుగా పినపాక నియోజకవర్గంలోని ఆళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన కందిమల్ల కిషన్ కి అత్యవసర చికిత్స ఖర్చులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన సుమారు లక్ష రూపాయల విలువగల ఎల్.ఓ.సీ చెక్కును మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేదల ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తుంది అన్నారు. అనేక నిరుపేద కుటుంబాలు వైద్య ఖర్చుల నిమిత్తం అప్పులు చేసి నానా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు చేసి భరోసా కల్పిస్తున్నామన్నారు. పినపాక నియోజకవర్గంలో వేలాది మంది పేద, మధ్యతరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతను అందించడం జరుగుతుందని తెలిపారు.