మా దేశానికే సొంతం

It belongs to our country– పనామా కాలువను అమెరికా మాకు బహుమతిగా ఇవ్వలేదు
– పనామా అధ్యక్షుడు జోస్‌ రౌల్‌ ములినో
దావోస్‌: పనామా కాలువ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలకు పనామా అధ్యక్షుడు జోస్‌ రౌల్‌ ములినో తీవ్రంగా స్పందించారు. ఈ కాలువ అమెరికా తమకు బహుతిగా ఇవ్వలేదన్నారు. ఈ కాలువ తమదేనంటూ గత కొన్ని రోజులుగా డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్తూ వచ్చారు. ఇటీవల తన ప్రమాణస్వీకారం సమయంలోనూ దీని గురించి ప్రస్తావించారు. ఆ కాలువను తప్పకుండా వెనక్కి తీసుకుంటామని పునరుద్ఘాటించారు. దీనిపై ములినో.. అమెరికాకు గట్టి కౌంటర్‌ ఇచ్చారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు(డబ్ల్యూఈఎఫ్‌)లో పాల్గొన్న ములినో కీలక వ్యాఖ్యలు చేశారు. పనామా కాలువపై ట్రంప్‌ చెప్పిన ప్రతి మాటనూ తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదంతా అవాస్తవమని తెలిపారు. ఆ కాలువ తమకు అమెరికా నుంచి రాయితీగానో, బహుమతిగానో వచ్చింది కాదన్నారు. అది మాది.. మాకు మాత్రమే సొంతమని ములినో స్పష్టం చేశారు.
పనామా కాలువను చైనా పరోక్షంగా నిర్వహిస్తోందని తన ప్రమాణస్వీకార కార్యమ్రంలో ట్రంప్‌ ఉద్ఘాటించిన విషయం విదితమే. తాము దానిని చైనాకు ఇవ్వలేదనీ, పనామాకు ఇచ్చామనీ, ఇప్పుడు దానిని వెనక్కి తీసుకుంటామని అన్నారు. ఈ వ్యాఖ్యలపైనే ములినో స్పందించారు. ఈ కాలువ విషయంలో చైనా ఎలాంటి జోక్యమూ చేసుకోవడం లేదని ఆయన చెప్పారు. ఇలాంటి ప్రకటనలతో పనామా ప్రజలను తప్పుదోవ పట్టించలేరన్నారు