– 65శాతం రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని తిరస్కరించిన పాట్నా హైకోర్టు
– 50 నుంచి 65 శాతానికి పెంచిన నితీశ్ సర్కార్
పాట్నా : విద్య ఉద్యోగ రంగాల్లో బీసీ, ఓబీసీ, ఎస్‌సీ, ఎస్‌టీల రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ బీహార్ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలను పాట్నా హైకోర్టు గురువారం రద్దు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కులగణన చేపట్టిన నితీశ్ కుమార్ ప్రభుత్వం .. నివేదిక ఆధారంగా 50 శాతంగా ఉన్న రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. రిజర్వేషన్ల సవరణ బిల్లు ప్రకారం.. ఇబిసిలకు 18 శాతం నుంచి 25 శాతం, బీసీలకు 12శాతం నుంచి 18 శాతం, ఎస్‌సీకి 16 శాతం నుంచి 20 శాతం, ఎస్‌టీ 1 శాతం నుంచి 2 శాతానికి పెంచింది. బీసీ మహిళలకు అప్పటివరకు ఉన్న 3 శాతం రిజర్వేషన్‌ను రద్దు చేశారు. ఇక, ఆర్థికంగా వెనకబడినవారిని ఉద్దేశించిన 10శాతం రిజర్వేషన్లు కలిపితే మొత్తం రిజర్వేషన్లు 75 శాతానికి చేరాయి. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ గౌరవ్ కుమార్, ఇతరులు పాట్నా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లపై సుదీర్ఘ విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి కె.వి. చంద్రన్‌తో కూడిన డివిజన్ బెంచ్ మార్చి 11, 2024న తీర్పును రిజర్వ్ చేసింది.
ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఓబీసీలకు 65 శాతం రిజర్వేషన్‌ను పెంచడంతో ప్రభుత్వ సర్వీసులో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 35 శాతం పొస్టులు మాత్రమే ఇవ్వగలిగారని న్యాయవాది దినుకుమార్ కోర్టుకు తెలిపారు. జనరల్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా బలహీన వర్గాలు )కి ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్‌ను రద్దు చేయడం రాజ్యాంగంలోని సెక్షన్ 14, సెక్షన్ 15(6),(బి)కి విరుద్ధమని వాదించారు. కులగణన సర్వే అనంతరం దామాషా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించారని అన్నారు. ఇందిరా సాహ్ని కేసులో రిజర్వేషన్ల పరిమితిపై సుప్రీంకోర్టు 50 శాతం పరిమితి విధించిందని తెలిపారు. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.