మూన్‌లైటింగ్‌ ఉద్యోగులకు ఐటీ శాఖ షాక్‌

న్యూఢిల్లీ : ఐటీ పరిశ్రమలో రెండేసి ఉద్యోగులు (మూన్‌లైటింగ్‌) చేసే వారికి ఆదాయపు పన్ను శాఖ షాక్‌ ఇచ్చింది. ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్‌ సమయంలో చాలా మంది ఉద్యోగులు అధిక ఆదాయం కోసం రెండేసి ఉద్యోగాలు చేశారు. కానీ.. ఆ ఆదాయాలను ఐటీ రిటర్న్‌లలో చూపించలేదు. దీంతో ఆయా ఉద్యోగులకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిందని ఇటి ఓ కథనంలో పేర్కొంది. ప్రస్తుతానికి 2019-2020, 2020-2021 ఆర్థిక సంవత్సరాల ఆదాయాలకు సంబంధించి నోటీసులు ఇచ్చిందని సమాచారం. మూన్‌లైటింగ్‌ ద్వారా సంపాదిస్తున్న వారిలో ఎక్కువ మంది ఐటి రంగం, అకౌంటింగ్‌ మేనేజ్‌మెంట్‌ నిపుణులు ఉన్నారు. మూన్‌ లైటింగ్‌ సంపాదనపై పన్ను చెల్లించని దాదాపు 1000 మందికి పైగా ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. మూన్‌లైటింగ్‌కు పాల్పడిన వారిని కొన్ని సంస్థలు ఉద్యోగం నుంచి తొలగించిన ఘటనలు ఉన్నాయి. తొలుత రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు వార్షికాదాయాన్ని రిటర్నుల్లో చూపించని వారికి ఈ నోటీసులు పంపినట్టు తెలుస్తోంది.