ప్రభుత్వ కార్యక్రమంగా మార్చేశారు

As a government program Changed– ఇది రాజ్యాంగ విరుద్ధం
– మతం, ప్రభుత్వం మధ్య రేఖ పలచబడుతోంది
– అయోధ్య ప్రాణ ప్రతిష్టపై పినరయి వ్యాఖ్య
తిరువనంతపురం : అయోధ్యలో జరిగిన ప్రాణ ప్రతిష్టను ప్రభుత్వ కార్యక్రమంగా మార్చడాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తప్పుపట్టారు. ఇతర మతాలను కించపరుస్తూ, ఏదో ఒక మతానికి ప్రాచుర్యం కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. మతం, ప్రభుత్వం మధ్య ఉండే రేఖ ఇప్పుడు పలచబడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘భారత ప్రజాస్వామిక రిపబ్లిక్‌కు లౌకికతత్వం ఆత్మ. జాతీయోద్యమ కాలం నుండి ఒక దేశంగా మన గుర్తింపులో అది ఓ భాగం. వివిధ మత విశ్వాసాలు కలిగిన వారు, ఏ మతంతోనూ సంబంధం లేని వారు స్వాతంత్రోద్యమంలో భాగస్వాములయ్యారు. ఈ దేశం ప్రజలందరిదీ. భారతీయ సమాజంలోని అన్ని వర్గాలదీ. ఇందులో అందరూ సమానమే. మతం అనేది ప్రైవేటు వ్యవహారం. ఎవరి మత విశ్వాసాలు వారు అనుసరించే స్వేచ్ఛ ప్రజలందరికీ ఉంది. అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ అందరికీ ఉన్నదని రాజ్యాంగం చెబుతోంది. మతాన్ని ఆచరించేందుకు, దానిని ప్రచారం చేసేందుకు హక్కు ఉంది. భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేసే మనం దేశంలోని ప్రతి వ్యక్తికీ సమాన హక్కులు ఉండేలా చూడాల్సి ఉంది. అదే సమయంలో ఏదో ఒక మతానికి ప్రాచుర్యం కల్పించకూడదు. ఇతర మతాలను కించపరచకూడదు’ అని పినరయి తెలిపారు. ‘భారతీయ లౌకికవాదం అంటే మతాన్ని, ప్రభుత్వాన్ని వేరు చేయడమేనని తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అభిప్రాయపడ్డారు. దానిని కొనసాగించే బలమైన సంప్రదాయం కూడా మనకు ఉంది. అయితే మతం, ప్రభుత్వం మధ్య ఉండే రేఖ ఇటీవలి కాలంలో సన్నబడిపోతోంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనవద్దని రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు గతంలో హెచ్చరించారు. అయితే ఇప్పుడు ఆ కాలం లేదు. ఫలితంగా ఓ లౌకిక దేశంగా మన విశ్వసనీయతలపై అపోహలు కలుగుతున్నాయి’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఓ ప్రార్థనా స్థలం ప్రారంభోత్సవాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా జరుపుకోవడాన్ని ఇప్పుడు చూస్తున్నామని పినరయి వ్యాఖ్యానించారు. తమలో చాలా మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారని చెబుతూ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేసిన వారిగా దానికి హాజరయ్యేందుకు నిరాకరించామని, తద్వారా తమ లౌకిక స్వభావాన్ని చాటిచెప్పామని, రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తించామని అన్నారు. మతం, భాష, ప్రాంతం, వర్గ వైవిధ్యాలకు అతీతంగా దేశ ప్రజలందరి మధ్య సామరస్యాన్ని, సోదర భావాన్ని పెంపొందించాలని పినరయి చెప్పారు. శాస్త్రీయ దృక్పథాన్ని, మానవత్వాన్ని, సంస్కరణల స్ఫూర్తిని పెంపొందించుకొని దేశం మరింత సౌభాగ్యవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.