అది నష్టపరిచే చర్య

 ఆర్బీఐ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
-రెండు బ్యాంకు యూనియన్ల సంయుక్త ప్రకటన
న్యూఢిల్లీ : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తీరుపై రెండు కీలక బ్యాంకు యూనియన్లు అయిన ఆలిండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడెరేషన్‌(ఏఐబీఈఏ), ఆలిండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏఐబీఓసీ)లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించిన రుణాల విషయంలో ‘రాజీ సెటిల్‌మెంట్‌’కు బ్యాంకులను అనుమతించడాన్ని అవి తప్పుబట్టాయి. దాదాపు ఆరు లక్షల ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ రెండు బ్యాంకు యూనియన్లు.. ‘రాజీ సెటిల్‌మెంట్‌’ విషయంలో ఆర్బీఐ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ఈ మేరకు ఏఐబీఓసీ జనరల్‌ సెక్రెటరీ రూపం రారు, ఏఐబీఈఏ జనరల్‌ సెక్రెటరీ సీహెచ్‌ వెంకటాచలం లు ఈ సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. రాజీ సెటిల్మెంట్‌తో పాటు సాంకేతిక రైటాఫ్‌లకు సంబంధించిన ఆర్బీఐ చర్యలు నష్టపరిచేవిగా రెండు బ్యాంకు యూనియన్లు అభివర్ణించాయి. ఇది మొత్తం బ్యాకింగ్‌ వ్యవస్థ సమగత్రను రాజీపడేలా చేస్తుందని ఆందోళనను వ్యక్తం చేశాయి. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల సమస్యను ప్రభావవంతంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు చేస్తున్న ప్రయత్నాలను ఇది అణగదొక్కుతుందని వివరించాయి. ఆర్బీఐ తన అనవసరమైన నిర్ణయాన్ని సమీక్షించి ఉపసంహరించుకోవాలనీ, బదులుగా ఉద్దేశపూర్వక ఎగవేతదారులను వారి చర్యలకు జవాబుదారీగా ఉంచడానికి బలమైన చర్యలను అమలు చేయటంపై దృష్టి పెట్టాలని కోరాయి.