భాష ఏమి చేయగలుగుతుందో, భాషతో ఎటువంటి భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చో ప్రతీ విద్యార్థికి తెలియాలి. ఇది ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ఇంటి నుండి మొదలుకొని విశ్వవిద్యాలయం దాకా ఓ ప్రచార అంశంగా ఎంచుకోవాలి.మాతృభాష పట్ల ఆసక్తిని పిల్లల్లో పెంచే క్రమంలో (పెంపొందించే క్రమంలో) తల్లిదండ్రుల నుండి మొదలుకొని ప్రభుత్వం వరకు చిత్తశుద్ధి చూపాల్సిన అవసరం ఉంది. ఇది బాధ్యతగా తీసుకోవాల్సిన ఆవశ్యకత నెలకొని ఉన్నది. మాతృభాష కేవలం భావ వినిమయానికే కాదు ఇతర భాషలను నేర్చుకోవడానికి నూతన ఆవిష్కరణలు చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అభివృద్ధికి, ఆధునికతకు సాక్షీభూతంగా నిలుస్తున్న ప్రతి ప్రసార, ప్రచార మాధ్యమానికి భాషే ప్రాణమని, ఆ ప్రాణం మాతృభాష ద్వారానే ఆవిర్భవిస్తుందని గుర్తించాలి.
మాతృమూర్తి ఒడిని మన మొదటి బడి అని అంటుంటాం. అలానే మాతృభాషకు ఒడిగా, ఒరవడిగా మన బడులు నిలవాలి. ఓనమాల నుండి సకల ప్రక్రియల పరిచయం, సాహిత్యం పరిమళం పాఠశాల దశలోనే విద్యార్థికి అవగాహన కల్పించే విధంగా, ఆనాటి నుండి నేటి వరకు పాఠ్య పుస్తకాల రూపకల్పన జరుగుతూనే ఉన్నది. సమాజంలో మారుతున్న వివిధ పరిణామాల దృష్ట్యా మాతృభాష’కు దేహమే తప్ప ప్రాణం, ఆత్మ లేవని నిర్ద్వంద్వంగా చర్చించుకోవచ్చునేమో! బడిలో మొక్కుబడిగా పాఠాలు, ప్రశ్న జవాబులు, పరీక్షలు తప్ప ‘మాతృభాషా బోధన’కు మరోలక్ష్యం లేకుండానే ముందుకు సాగు సాగుతున్నదనడానికి వెనుకాడనక్కర్లేదేమో!తల్లిదండ్రులు, సమాజం, పాఠశాల, ఉపాధ్యాయుడు, విద్యార్థి, విద్యావిధానం వీటి సమాహారమే, వీటి కలయికే ‘బడిలో తెలుగు’కు ప్రాణం పోసినా! తీసినా!తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటి భాషకు(వాతావరణానికి) దూరం చేశారు. పరభాష వ్యామోహం కావచ్చు, యాంత్రిక జీవన విధానం కావచ్చు , చేతులలో చరవాణీ విన్యాసం కావచ్చు, ప్రసారమాధ్యమాల ప్రలోభం కావచ్చు. వీరి మధ్య ఉండాల్సిన భావ వినిమయ తంత్రులను తెంపివేసింది. ‘సమాజం మాట్లాడుకోవడం మానేసింది’ అని సమాజమే అనుకుంటున్నది.
ఆధునిక జీవన విధానంలో ‘సమయం లేదు’ అనే ఓ నినాదాన్ని నెత్తికెత్తుకొని అవసరం మేరకే మాట్లాడుకోవడం, ముఖ్యంగా నిరక్ష రాస్యులు కూడా వరభాషా పదాలు అసంబద్ధంగా వాడైనా నాగరికలుగా చలామణి కావాలనుకునే తపన, బడిలో అడుగిడే పిల్లలకు ఏ పదాలు సరిగా పరిచయం కాక ‘తడబడుతూ’ వస్తున్నారు. మాతృభాష భవిష్యత్తుకు బాట వేస్తుందను భావనే సమాజ బాటలో కనుమరుగైంది. పాఠశాల(బడి)ని ‘విద్యాలయం’ అంటాం. బడిని చదువుల ‘గుడి’గా చెప్పుకుంటాం, ఒప్పుకుంటాం. ఇప్పుడు ఆ చదువుల గుడిలో ‘మాతృభాష’ కనీసం ఓ సాధారణ భక్తునిగా కూడా క్యూలైన్లో లేదు. ఆ గుడిలో ఏ అర్చన జరగాలన్న మాతృభాషయే వాహకం( మాధ్యమం), ఏ మాలవేయాలన్నా మాతృ భాషయే సూత్రం. అది మరిచిన సోదర ఉపాధ్యాయులు మంత్రాన్ని, పూలని మాత్రమే చూపిస్తూ ‘అంత:సూత్రాన్ని’ విడిచారు. ఆంగ్ల మాధ్యమానికి ‘మాతృభాష’ ఎందుకని పెదిమలు విరిచారు. మస్తిష్కంలో ఆలోచనలకు అమ్మభాష పునాది అని మరిచారు. త్రిశంకు స్వర్గంలో విద్యార్థులను నిలిపారు.
మాతృభాషోపాధ్యాయుడు పాఠ్యపుస్తకానికే పరిమితమయ్యాడు. సిలబస్, పరీక్షలు, మార్కులే లక్ష్యంగా బోధన సాగిస్తున్నాడు. ఒకటవ తరగతి నుండి పది సంవత్సరాలు పాఠ్యపుస్తకాన్ని అనుసరిస్తున్నాడు. వచ్చిన వారికే వస్తున్నది, రానివారికి రావట్లేదు. నేర్పడం కనుమరుగైంది. నేర్వడం అవమానమైంది. తనకు రావడానికి విద్యార్థులకు నేర్పడానికి మధ్య గల వ్యత్యాసం గుర్తించి, తనకు తాను చేసే ప్రయత్నం దూరమైంది. ‘కర్ణుని చావుకు కారణాలెన్నో’ అను సామెత మళ్లీ వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు వినడం మానేశారు. చూడడం, ఆడడం మొదలు పెట్టారు. కారణాల లోతుల్లోకి వెళ్ళను. ఆ రణానికి ఎన్ని కారణాలో మనందరికీ తెలుసు. వినాలి అంటే ఆసక్తి ఉండాలి. ఉత్తమ జీవన విలువలు, ఉన్నత జీవన ప్రమాణాలు, ఉమ్మడి కుటుంబాలు అందించాయి. తద్వారా పిల్లల ప్రవర్తన సహజంగానే క్రమశిక్షణతో ఉండేది. ‘వినడం’ అనే ఒక సామర్ధ్యం వారి నరనరాల్లో నిండి ఉండేది.మారిన కాలంలో పిల్లలు బడికి వెళ్ళేది పరీక్షల కోసం, మార్కుల కోసం, ర్యాంకుల కోసం,భవిష్యత్తులో డబ్బు సంపాదించంకోసం కొంతమంది, ఎందుకు వెళ్తున్నారో ఇంకా తెలియనివారు ఇంకాంతమంది. ముఖ్యంగా ప్రభుత్వ బడులలో పిల్లల ‘ఉపస్థితే’ ప్రధానమైన సమస్యగా మారి, ఈ స్థితికి కారణమైంది. పిల్లలని బడికి పంపడమే తల్లిదండ్రులకు ఒక టాస్క్ గా మారింది. వచ్చిన వారిని రోజంతా తరగతి గదిలో ఉండేలా చూడడమే ఉపాధ్యాయులకు ఒక పరీక్షగా మిగిలింది.ఒకప్పుడు ప్రపంచ యుద్ధాల ప్రభావం మాదిరిగా, 2020-2022 తర్వాత ”కరోనాకు ముందు కరోనాకు తర్వాత విద్యార్థుల చదువు” అనేది అంశంగా మారింది.
విద్యార్థులు ప్రధానంగా, వినడానికి సముఖంగా లేకపోవడం, మౌఖిక భావ వినిమయ ప్రయత్నం చేయకపోవడం, ఉచ్చారణ పరమైన శ్రద్ధ వహించకపోవడం, పాఠ్యపుస్తకాన్ని కానీ, ఇతర పుస్తకాలను కానీ చదువకపోవడం, ఆలోచించి సొంతంగా రాయడానికి ప్రయత్నించక పోవడం, భాష నేర్చుకోవడం వలన కలిగే ప్రయోజనాలను తెలుసుకోకపోవడం లేదా గుర్తించక పోవడం, అను లోపాలను కలిగివున్నారు. భాష ఏమి చేయగలుగుతుందో, భాషతో ఎటువంటి భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చో ప్రతీ విద్యార్థికి తెలియాలి. ఇది ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ఇంటి నుండి మొదలుకొని విశ్వవిద్యాలయం దాకా ఓ ప్రచార అంశంగా ఎంచుకోవాలి.మాతృభాష పట్ల ఆసక్తిని పిల్లల్లో పెంచే క్రమంలో (పెంపొందించే క్రమంలో)తల్లిదండ్రుల నుండి మొదలుకొని ప్రభుత్వం వరకు చిత్తశుద్ధి చూపాల్సిన అవసరం ఉంది. ఇది బాధ్యతగా తీసుకోవాల్సిన ఆవశ్యకత నెలకొని ఉన్నది. మాతృభాష కేవలం భావ వినిమయానికే కాదు ఇతర భాషలను నేర్చుకోవడానికి నూతన ఆవిష్కరణలు చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అభివృద్ధికి, ఆధునికతకు సాక్షీభూతంగా నిలుస్తున్న ప్రతి ప్రసార, ప్రచార మాధ్యమానికి భాషే ప్రాణమని, ఆ ప్రాణం మాతృభాష ద్వారానే ఆవిర్భవిస్తుందని గుర్తించాలి. పుట్టిన నుండి గిట్టేదాకా ప్రతిక్షణం మానసికోల్లాసానికి, విచక్షణకు, వికాసానికి,విద్యుత్తుకు భాష అనుసంధానకర్తగా నిలుస్తుందని తెలుసుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ విశ్వంలో మనిషిని మనిషిగా చూపే ఏకైకశక్తి భాషేనని పిల్లలు గుర్తించేలా చూడాల్సిన, చూపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది.
విద్యావిధానాలు పాఠ్యపుస్తకాలు, బోధనా విధానాలకే పరిమితం కాకుండా మాతృభాషాధ్యయనం జీవికకు ఎలా దోహదపడుతుందో మార్గదర్శనం చేసేలా ఉండాలి. మాతృభాష మనుగడ బలోపేతం కావాలంటే ‘బడులే’ కేంద్రాలు. ఆ బడులలో తెలుగు పరిపుష్టం కావాలంటే ప్రభుత్వ పరంగా కీలక నిర్ణయాలు తీసుకొని చిత్తశుద్ధితో అమలు చేయాలి. శాస్త్ర సాంకేతిక రంగాలలో దూసుకుపోతున్న దేశాలన్నీ ‘మాతృభాషనే’ నమ్ముకొని ముందుకు సాగుతున్నాయి అన్న యదార్థాన్ని గుర్తించాలి. ‘తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు తీర్చిదిద్దబడటం ఎంత సత్యమో, ‘బడులలో తెలుగు బాగుపడితే మన రాష్ట్రం విద్యాపరంగా అంతే ముందుకు సాగుతుందన్నది అంతే నిజం’. కాబట్టి బడులలో భాషోపాధ్యాయుల నియామకం, నియామక నిష్పత్తి, వారికి కేటాయించే పీరియడ్ల సంఖ్య ఒక కీలక అంశంగా నిలుస్తుంది. భాషాభివృద్ధికి వివిధ రూపాల్లో విద్యార్థులకు ప్రోత్సాహకాలు, పారితోషికాలు ఇవ్వాలి.
భాషావశ్యకతను తెలిపే కార్యక్రమాలతో రూపొందించిన విద్యా క్యాలెండర్‌ను ప్రకటించాలి. ఉన్నత చదువులలో, ఉద్యోగాలలో మాతృభాషకు ప్రాధాన్యత కల్పించే మార్గాలను రూపొందించి, ప్రాధాన్యతనివ్వాలి. మాతృభాషఅధ్యయనం ద్వారా కలిగే ప్రయోజనాలను శాస్త్రీయంగా విద్యార్థులకు తెలియజేసే ప్రణాళికలు రూపొందించాలి, వారికి చేరవేయాలి. ప్రభుత్వపరంగా అధికారికంగా ఇవన్నీ జరిగినప్పుడే బడులలో భాష సజీవంగా ఉండి వెలుగులను విరజిమ్ముతుంది. ఎటువంటి కట్టుబాటులు లేకుండా పరీక్షలు, మార్కులు, ర్యాంకులకే పరి మితమై, కేవలం ఒక బోధనాంశంగా మాత్రమే పరిగణించబడినంత కాలం మాతృభాష మనుగడ ముసుగుతో మసక బారే ఉంటుంది. అమ్మ భాషకు గుడి కేవలం బడి మాత్రమే. బడి అంటేనే (భావిభారత) భావి తెలుగు తల్లి బిడ్డలు.వారి భవిష్యత్తును తీర్చిదిద్దే భాషామతల్లి పరిమళాన్ని దశదిశలా వ్యాపింపచేద్దాం. మన బాధ్యతను మనం నిర్వర్తించుదాం!
చక్రవర్తుల శ్రీనివాస్ 8008791827