– ప్రొఫెసర్ కోదండరామ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి ఉండకపోతే ఎలా ఉంటుందో ప్రజలు తీర్పు ఇచ్చారని టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం వ్యాఖ్యానించారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కు వద్ద తెలంగాణ అమరులకు ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ పాలకులైనా సరే… ప్రజాస్వామిక విలువలను పాటించాల్సిందేననీ, లేకుంటే ఫలితాలు ఇదే విధంగా ఉంటాయని తెలిపారు. కేసీఆర్ ప్రజలను గడ్డిపోచ మాదిరిగా తీసి పారేశారనీ, ఆ గడ్డిపోచలే అన్ని కలిసి కుర్చీలో నుంచి దించేశాయన్నారు. తొమ్మిదన్నరేండ్ల పీడన అనుభవించిన ప్రజలు నిరసన తెలపకుండా, సమావేశాలు పెట్టుకోకుండా నిరంకుశంగా వ్యవహరించారని తెలిపారు. నిరుద్యోగులు, రైతులు, సింగరేణి, ఆర్టీసీ కార్మికులు, నిర్వాసితులు, పోడు భూములు ఇలా అనేక సమస్యలను ఆ నిర్బంధాల మధ్య వెలుగులోకి తెచ్చినట్టు తెలిపారు. ప్రజల చైతన్యం తగ్గలేదనీ, సమయం రాగానే కనబరిచారన్నారు. సీఎం కేసీఆర్ ను ఒకసారి దించకపోతే అహంభావం పెరిగిపోతుందని పసిగట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బద్రుద్దీన్, ప్రధాన కార్యదర్శి బైరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.