అది మానని గాయం!

It's a permanent injury!– పారిస్‌ ఒలింపిక్స్‌పై వినేశ్‌ ఫోగట్‌
నవతెలంగాణ-చంఢగీడ్‌
పారిస్‌ ఒలింపిక్స్‌ నుంచి స్వదేశం చేరుకున్న వినేశ్‌ ఫోగట్‌ అభిమానుల అపూర్వ ఆదరణ, ప్రేమాభిమానులను చూరగొన్నది. మహిళల 50 కేజీల ఫ్రీ స్టయిల్‌ విభాగంలో ఫైనల్‌కు చేరుకున్న వినేశ్‌ ఫోగట్‌ కనీసం రజత పతకం ఖాయం చేసుకున్నది. కానీ పసిడి పోరుకు ఉదయం బరువు ఓ 100 గ్రాములు అధికంగా ఉన్నది. దీంతో ఒలింపిక్స్‌ నిర్వహణ కమిటీ, యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌లు వినేశ్‌ ఫోగట్‌పై అనర్హత వేటు వేయటంతో పాటు ఆమె నుంచి సిల్వర్‌ మెడల్‌ను సైతం లాగేసుకున్నారు. ఈ నిర్ణయాన్ని కాస్‌ (కోర్టు ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌)లో వినేశ్‌ ఫోగట్‌ సవాల్‌ చేసింది. వినేశ్‌ ఫోగట్‌ తరఫున ఫ్రెంచ్‌ న్యాయవాదులు వాదనలు వినిపించగా.. భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) సైతం వినేశ్‌ ఫోగట్‌కు మెడల్‌ ఇవ్వాలని వాదించింది. తీర్పును మూడుసార్లు వాయిదా వేసిన కాస్‌ న్యాయమూర్తి.. ఆఖరుకు వినేశ్‌ ఫోగట్‌ అప్పీల్‌ను తిరస్కరించారు. సంయుక్త రజత పతకం ఇవ్వటం కుదరదని తేల్చిచెప్పారు. కాస్‌ తీర్పు కోసం పారిస్‌లోనే ఉండిపోయిన వినేశ్‌ ఫోగట్‌ కాస్త ఆలస్యంగా శనివారం స్వదేశం చేరుకున్న సంగతి తెలిసిందే. ఉదయం న్యూఢిల్లీలోని ఇంధిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వినేశ్‌ ఫోగట్‌.. అర్థరాత్రి అనంతరం స్వగ్రామం చేరుకుంది. స్వగ్రామానికి వినేశ్‌ ఫోగట్‌ ప్రయాణం ర్యాలీగా సాగగా.. దారిపొడవునా అభిమానులు, ప్రజల ప్రేమాభిమానులతో వినేశ్‌ తీవ్ర భావోద్వేగానికి గురైంది. స్వగ్రామంలో ప్రజలు బంగారు పతకం బహూకరించిన అనంతరం వినేశ్‌ ఫోగట్‌ భావోద్వేగంగా మాట్లాడింది.
‘ఇంతటి అభిమానం, ప్రేమకు నేను అర్హురాలు అవునో కాదో నాకు తెలియదు. ఇటువంటి ప్రాంతంలో పుట్టినినందుకు ఎంతో అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను. ఈ గ్రామంలో నా సహచర సోదరీమణులకు మల్లయుద్ధం శిక్షణ ఇస్తాను. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు పతకాలు సాధించగల రెజ్లర్లను సిద్ధం చేస్తాను. మీ అందరి ప్రేమ, అభిమానానికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. పారిస్‌ ఒలింపిక్స్‌ పతకం దక్కకపోవటం లోతైన గాయం చేసింది. ఆ వేదన నుంచి కోలుకునేందుకు సమయం పడుతుంది. కానీ నా దేశ ప్రజలు, నా గ్రామ ప్రజల ప్రేమతో ఆ గాయం త్వరగా నయం అవుతుందని అనుకుంటున్నాను’ అని వినేశ్‌ ఫోగట్‌ అన్నారు.

వినేశ్‌కు స్వర్ణం
భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌కు అపూర్వ గౌరవం లభించింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో సంయుక్త సిల్వర్‌ మెడల్‌ విజేతగా నిలిచే అవకాశం కోల్పోయిన వినేశ్‌ ఫోగట్‌ను స్వగ్రామ ప్రజలు హృదయానికి హత్తుకున్నారు. మహిళల 50 కేజీల ఫ్రీ స్టయిల్‌ విభాగం ఫైనల్‌కు చేరుకునే క్రమంలో ముగ్గురు రెజ్లర్లను మట్టికరిపించిన వినేశ్‌ ఫోగట్‌కు బంగారు పతకం బహూకరించారు. శనివారం అర్థరాత్రి అనంతరం స్వగ్రామం బాలాలీ చేరుకున్న వినేశ్‌ ఫోగట్‌కు ఘన స్వాగతం లభించింది. గ్రామంలోని మహిళలు, యువత, గ్రామ పెద్దలు వినేశ్‌ ఫోగట్‌ను పూల దండలతో ఆహ్వానించారు. బరువు తగ్గే క్రమంలో అనారోగ్యానికి గురైన వినేశ్‌ ఫోగట్‌ పూర్తి ఆరోగ్యం సాధించాలని ఆమెకు దారి పొడవునా ప్రజలు పాలు అందించారు. గతంలో బాలాలీ గ్రామ ప్రజలు ప్రకటించి నట్టుగా.. వినేశ్‌ ఫోగట్‌కు బంగారు పతకం ప్రదానం చేశారు. వినేశ్‌ ఫోగట్‌కు పతక ప్రదాన కార్యక్రమం శనివారం అర్థరాత్రి 2 గంటలకు ముగిసింది. అప్పటి వరకు బాలాలీ గ్రామ ప్రజలతో పాటు అభిమానులు, సమీప గ్రామాల నుంచి ప్రజలు వినేశ్‌ ఫోగట్‌ ర్యాలీలో పాల్గొన్నారు.