ఇది ఊహల సమీక్షా వేదిక

ప్రొఫెసర్‌ గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తికి ఈ పుస్తకం అంకితం చేశారు రచయిత. డా||కొమ్మూరి ప్రసాద్‌, గుడిపాటి గారలు ముందు మాటలు రాశారు. పుస్తకాల్ని సమీక్షించే సందర్భంలో ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా పలు సూచనలు చేయడం నరసింహారెడ్డి ప్రత్యేకత. గుడిపాటివారు అన్నట్లుగా, ఆధునిక తెలుగు కవిత్వం చదివే పాఠకులకు, బోధించే అధ్యాపకులకూ, పరిశోధకులకూ అవశ్య పఠనీయ గ్రంథమిది. కవిత్వ రచన, పరిశోధన, విమర్శ, నేటి సాహిత్య ధోరణుల్ని ఈ గ్రంథంలో సమీక్షించారు నరసింహారెడ్డి. 62 వ్యాసాలున్నాయి. చారిత్రక వస్తువుతో కూడిన కథాకార్యం పిరదౌసి… క్రీ.శ. 940 – 1020 మధ్యకాలంలో కవి హకీం అబ్దుల్‌ కాశీం పిరదౌసి, గజనీ మహ్మద్‌ కోరికతో కావ్యం రాయడం, బంగారు నాణేలకు బదులు వెండి నాణేలు ఇవ్వడం, కవి, అతని కుమార్తె వాటిని తిరస్కరించడం… అదో చరిత్ర. చిన్న చరిత్ర శకలాన్ని కావ్యంగా జాషువా రాస్తాడు. పిరదౌసి కావ్యం అనుసరించే నార్ల చిరంజీవి ‘భాగ్య నగరం’, కట్టమంచి ముసలమ్మ మరణం – విద్వాన్‌ విశ్వం ‘పెన్నేటి పాట’, డా||సి.నా.రె. ‘కర్పూర వసంతరాయలు’ రాయడం జాషువా విజయాన్ని సూచిస్తుంది అంటారు. రచయిత పిరదౌసిని సమీక్షిస్తూ సినారె నాగార్జున సాగరం సుదీర్ఘ ప్రేమకథా గేయకావ్యం ఐదు వందల గేయ ఖండాలతో రాశారంటారు. పద్మశ్రీ ఇనాక్‌ గారి ‘విశాల శూన్యం’ సమీక్షిస్తూ ఒక చోట ఇలా రాశారు… ఆవేశం కవిత్వ లక్షణం. అది స్థిరీకరింపబడ్డ వ్యక్తీకరణగా వుండాలన్న వర్డ్‌వర్త్‌ మాటలను గుర్తు చేస్తుంది. అదే సందర్భంలో సంయమనంతో పనిగట్టుకొని స్పష్టత కోసం ప్రయత్నిస్తే కవిత్వం దూరమవుతుంది అనే ద్యాస ఈ మహారచయితకుంది (పేజీ 31) అంటారు. కవిత్వానికి మల్టీ డైమెన్షన్స్‌ వుండడం చాలా గొప్ప లక్షణం. భువన కవనాన్ని రాస్తూ ‘ఒక జిల్లా సాహిత్యకారుల చిట్టా ఒకచోటుకి తేవడమనే బృహత్‌ కార్యాన్ని రంగయ్య నెరవేర్చగలిగాడు (పేజీ.41) అంటారు.
దాసోజు లలిత ‘దాతి’ కవిత్వ సంపుటిపై రాస్తూ వుండవలసిన ఆర్ద్రత, క్రాంతి దర్శిత్వం, ఫైర్‌ దాసోజు లలిత కవిత్వంలో ప్రతి కవితలోనూ గమనించవచ్చు అంటారు (పేజీ 53).
సౌందర్యాత్మకత సృజనకే కాదు, సామాన్యుల ఇతివృత్తాలకూ వర్తిస్తుందని నిరూపించిన కవిత్వ సంపుటి బూడిద చెట్లపూలు (పేజీ 63) అంటారు. రూప్‌కుమార్‌ కవిత్వాన్ని విశ్లేషిస్తూ వ్యాఖ్యానానికి ఒదగని కవిత్వం వాస్తవికతకు అధివాస్తవికతకు కట్టిన వారధి లాంటిది (పేజీ 67) అంటారు. గతితర్కం వర్గ పోరాటంపై నమ్మకంతో పాటు అపారమైన గౌరవం ఈ కవితా సంపుటి అడుగడుగునా కనిపిస్తుంది అంటారు. మువ్వా శ్రీనివాసరావు 6 ్‌ష్ట్ర ఎలిమెంట్‌పై (పేజీ 90) ఉద్యమాలకు వాదాలకు సంబంధం లేని జీవిత పార్వ్శాలకు సంబంధించిన కవిత్వం విఠలాపురం పుష్పలత కవిత్వంలో వుందంటారు రచయిత. నూరు శతకాల కవి చిగురుమళ్ల శ్రీనివాస్‌పై హసీనా కవిత్వ విశ్లేషణలు బాగున్నాయి.

– తంగిరాల చక్రవర్తి, 9393804472