రైతులకు గిట్టుబాటు ధర కల్పించామని బడ్జెట్లో  చెప్పటం సిగ్గుచేటు: రైతు సంఘం

నవతెలంగాణ –  కంటేశ్వర్
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బడ్జెట్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించామని నిర్మల సీతారామన్ చెప్పటం సిగ్గుచేటని తెలంగాణ రైతు సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ గురువారం  తీవ్రంగా ఖండించారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయకుండా నామమాత్రంగా రైతులకి బోనస్ రూపంలో వారికి మొక్కజొన్నకి, గోధుమలకు ఇచ్చారు తప్ప మద్దతు ధర ఇవ్వలేదని అన్నారు. పైగా రైతుల నడ్డి విడిచే విధంగా ఎరువులు విత్తనాల ధరలను విపరీతంగా పెంచేసి రైతులను నిలువునా ముంచిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ పెట్టుబడేదారులకు అనుకూలంగా వ్యవసాయ రంగాన్ని రైతాంగానికి దూరం చేయటం కోసం 3 నల్ల చట్టాలను తీసుకువచ్చిందని అన్నారు. పెద్ద ఎత్తున ఆందోళన చేసి ప్రభుత్వం వెనక్కి తీసుకొని వరకు రైతులు ఉద్యమాన్ని కొనసాగించారని అన్నారు. పోరాటం సందర్భంగా రాతపూర్వక ఇచ్చిన హామీని అమలు చేయకపోగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించామని చెప్పటం బడ్జెట్లో సిగ్గుచేటని అన్నారు. రైతులకు ఎం ఎస్ పి మద్దతు ధర రైతులు పెట్టిన పెట్టుబడిలో సగం కలిపి అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించాలని తెలంగాణ రైతు సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం మూడు నల్లచట్టాలను దొడ్డి దారిన అమలు చేస్తుందని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ అన్నారు.