– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
తహసిల్దార్ కార్యాలయాల ముందు బిఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఆ పార్టీ మండల కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014 ఎన్నికల సమయంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కొరకు రూ. ఐదు లక్షల చొప్పున ఇస్తామని నమ్మించి బిఆర్ఎస్ నాయకులు రెండు సార్లు అధికారంలోకి వచ్చిన ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్వయంగా గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పది సంవత్సరాలు అధికారంలో ఉండి నిరుపేదలకు చేసిందేమీ లేదన్నారు. నియోజకవర్గంలో కేవలం నాలుగైదు వందల ఇండ్లు నిర్మించి అందరినీ మోసం చేసిందే కాకుండా గృహలక్ష్మి లబ్ధిదారులతో ధర్నాలు చేయించడం సిగ్గుచేటు అన్నారు. గృహలక్ష్మి లబ్ధిదారులకు ఇచ్చిన ప్రొసీడింగులు ఎన్నికల నియామావళి అమలులో ఉండగా ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నిజంగా బిఆర్ఎస్ ప్రభుత్వానికి గాని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి గాని చిత్తశుద్ధి ఉంటే గత పది సంవత్సరాల నుండి ఎందుకు ఇవ్వలేదో లబ్ధిదారులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులే అయినా ఆరు గ్యారంటీల అమలుకు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. అందులో నుండి నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల చొప్పున ఇవ్వడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేయడం జరిగిందని, మిగతా గ్యారంటీలను కూడా తొందరలోనే నెరవేర్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఈ సమావేశంలో నాయకులు నిమ్మ రాజేంద్రప్రసాద్, పడిగేల ప్రవీణ్, పాలెపు నరసయ్య, వేముల గంగారెడ్డి, సింగిరెడ్డి శేఖర్, వేములవాడ జగదీష్, ఉట్నూర్ ప్రదీప్, సుంకేట శ్రీనివాస్, బుచ్చి మల్లయ్య, నల్ల సాయి, జైడి బాలకృష్ణ, పడాల గంగాధర్, ఆల్గోట్ రంజిత్, కౌడ శైలేందర్, పల్లపు రవి, అజారుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.