నవతెలంగాణ – డిచ్ పల్లి
రాష్ట్ర వ్యాప్తంగా రూ.8300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను పెండింగ్ లో ఉంచటం సరైంది కాదని,వెంటనే నిధులను విడుదల చేయాలని పి.డి ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయకపోవడన్నీ నిరసిస్తూ తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు శనివారం పి.డి.ఎస్.యూ ఆద్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను చెల్లించక పోవటం వలన విద్యార్థులపైన అదనపు ఆర్థిక భారం పడుతుందని , కాలేజీలలో యూనివర్సిటీలలో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, విద్యార్థులకు చెల్లించే మెస్ చార్జీలు ధరలకు అనుకూలంగా పెంచాలని, ఇంచార్జీ వైస్ ఛాన్సలర్ లతో యూనివర్సిటీలను నడపడం సరైంది కాదని, రెగ్యులర్ వీ సీ లను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ పి.డి.ఎస్.యూ నాయకులు ప్రిన్స్,రవీందర్,గోపి, రాకేష్, బాలాజీ, భారత్,మణికంఠ, నితిన్, దర్ము తదితరులు పాల్గొన్నారు.