చేవెళ్ల పార్లమెంటులో కాంగ్రెస్‌ జెండా ఎగడం ఖాయం

In Chevella Parliament The Congress flag is sure to be hoisted– కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రంజిత్‌ రెడ్డి
నవతెలంగాణ-పరిగి
చేవెళ్ల పార్లమెంట్లో కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయమని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రంజిత్‌ రెడ్డి అన్నారు. పరిగి నియోజకవర్గ కాంగ్రెస్‌ బూత్‌ స్థాయి కార్యకర్తల సమావేశం సోమవారం పరిగి పట్టణ కేంద్రంలోని ఏబిఎస్‌ ప్లాజాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, రాష్ట్ర సలహాదారు, చేవెళ్ల పార్లమెంట్‌ ఇన్‌చార్జి వేం నరేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి ముఖ్య అతిథులు హాజరయ్యారు. పార్టీలో చేరిన నాయకులకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రంజిత్‌ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు మరో యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం కావాలంటే ప్రతి ఎంపీ సీటు గెలవాలని అన్నారు. 6 గ్యారంటీలో అమలు చేసే బాధ్యత అందరం తీసుకుంటామని అన్నారు.పేదరికం నిర్మూలించాలని కాంగ్రెస్‌ పార్టీ సంక్షేమానికి పెద్దపీట వేసి అభివృద్ధి చేస్తుందని తెలిపారు. ప్రజాక్షేత్రంలో నాయకులు ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేయాలని అన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు అన్ని వర్గాల వారికి వైద్య సేవలు అందించినట్టు తెలిపారు. ఎప్పుడు ఫోన్‌ చేసిన కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. కార్యకర్తలు కష్టపడి పనిచేసి చేవెళ్ల పార్లమెంటులో కాంగ్రెస్‌ విజయం సాధించే విధంగా కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వ సలహాదారు, చేవెళ్ల పార్లమెంట్‌ ఇన్‌చార్జి వేమ్‌ నరేందర్‌ రెడ్డి మాట్లాడుతూ అందరి కృషితో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో బలంగా ఉండడమే కాదు కేంద్రంలో కూడా బలంగా ఉండాలని అన్నారు.15 ఎంపీ సీట్లు గెలిచి రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రి చేయాలని కోరారు. తుక్కుగూడ సమావేశంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుందన్నారు. బూత్‌ కమిటీ సభ్యులు కాంగ్రెస్‌ పార్టీ విధానాలను ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎంపీ రంజిత్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ పతనం ఖాయమని తెలిపారు. గతంలో కాంగ్రెస్‌ హాయంలో చేవెళ్లకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. జాతీయ రహదారి, అంతర్జాతీయ విమానాశ్రయం కాంగ్రెస్‌ హయాంలో తీసుకొచ్చామని తెలిపారు. చిట్టెంపల్లి నుంచి చేవెళ్ల మధ్యలో రీజినల్‌ రింగ్‌ రోడ్డు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి సీఎం రేవంత్‌రెడ్డి రూ. 20 కోట్లు మంజూరు చేశారని, ఇప్పటికే 10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.