నవతెలంగాణ-తుర్కయంజాల్
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో గల అన్ని వార్డుల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తుర్కయంజాల్ మున్సిపాలిటీ 8వ వార్డు కౌన్సిలర్ మర్రి మాధవి మహేందర్ రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ మల్ రెడ్డి అనురాధ రాంరెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం మున్సిపాలిటీ 8వ వార్డులో కమిషనర్ బి.సత్యనారాయణరెడ్డితో కలిసి అరుంధతి కాలనీ, బందావన్ కాలనీ, వైట్ ఫీల్డ్, సరిగమ సిటీ తదితర కాలనీలల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కౌన్సిలర్ మాధవి మహేందర్ రెడ్డి, కమిషనర్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించకుండా ప్రతి ఒక్కరూ జూట్ బ్యాగులను ఉపయోగించాలని సూచించారు. మున్సిపల్ పరిధిలో ఇంటింటికీ చెత్త సేకరించే ఆటోలోనే తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా ఇవ్వాలని, ప్రజలు చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకూడదన్నారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో రోడ్డుకు ఇరువైపులా పొదలను తొలగించుట, గుంతలను పూడ్చుట, రోడ్లను చదును చేయుట, ప్లాస్టిక్ సేకరణ, రోడ్లను శుభ్ర పరుచుట, కాలనీలల్లో దోమల నివారణకు ఫాగింగ్ చేయుట, దోమల లార్వ ను నియంత్రించే రసాయనలను పిచికారి చేయుట వంటి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఈఈ హరీష్, నగేష్, జవాన్ మధు, కాలనీ వాసులు పాల్గొన్నారు.