– తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. ఆనందాచారి
– మూడు భాగాలుగా కొనసాగిన సాహిత్య సదస్సు
– కవిత పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం
నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
సమాజం సమూహం నుండి చీలి ఒంటరితనంలోకి వెళ్ళిపోవటం చాలా ప్రమాదకరం.కవులు, రచయితలు స్తబ్దత నుండి బయటపడి సరికొత్త సృజనకై ఉపక్రమించాలి. అందుకోసం సమాజాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. ఆనందచారి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని యుటిఎఫ్ భవనంలో తెలంగాణ సాహితి ఉమ్మడి నల్లగొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాహితి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ సాహితి ఉమ్మడి నల్లగొండ జిల్లా శాఖ అధ్యక్షులు కుకుడాల గోవర్ధన్ అధ్యక్షతన సాహిత్య సదస్సు ను నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మనిషి రాను రాను ప్రేమ భావన నుండి వెదొలిగి కాటిన్యం వైపు ఆలోచించడం ఆందోళనకరమని అన్నారు. ఇదే సభలో సమాజం సాహిత్యం అనే అంశం పై ప్రధాన వక్తగా పాల్గొన్న ప్రముఖ కవి, రచయిత, పరిశోధకులు, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ సాహిత్య రంగంలో అభ్యుదయ సాహిత్యం నుంచి ఇప్పటివరకు వచ్చిన సాహితీ సంస్థలు,వాటి దృష్టి కోణాలు,పరిమితులను వివరించారు. ఇన్నాళ్లు అణగారిన వారి జీవితాలపై ఆధిపత్యం చేసిన మత దురహంకారం మళ్లీ పడగా విప్పి విజృంభిస్తున్నదని, ఇది సాధారణ ప్రజల జీవితాలకు ప్రమాదం అని, అందువల్ల వాటిని ప్రశ్నించే వైఖరితో రచయితలు,కవులు స్పందించాలని పేర్కొన్నారు.
ముఖ్యంగా విద్యార్థులైన యువ రచయితలు ఈ పనికి పూనుకోవాలని తెలియజేశారు. ఉదయం ప్రారంభమై ఆరు సెషన్లుగా నడచిన ఈ కార్యక్రమంలో అంశం స్వీయ కవితల్లో వస్తువుపై జీవకవి మునాస్ వెంకట్, స్వీయ కథల్లో సామాజిక జీవన చిత్రలపై ప్రముఖ కథా రచయిత భూతం ముత్యాలు, స్వీయ గీతాల్లో సామాజిక స్పృహ పై ప్రముఖ గాయకుడు అంబటి వెంకన్న ఉపన్యసించారు. అనంతరం ప్రముఖ కవి రచయిత తండు కృష్ణ కౌండిన్య నిర్వహణలో జరిగిన కవి సమ్మేళనంలో కవులందరూ పాల్గొని తమ తమ కవితలను వినిపించారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా తెలంగాణ సాహితి ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ మహ్మద్ సేన, ఆత్మీయ అతిథిగా కవి రచయిత మోత్కూరు శ్రీనివాస్ వ్యవహరించారు. కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులకు శాలువాలతో సత్కరించారు.సాయంత్రం ముగింపు సభ తెలంగాణ సాహితి జిల్లా అధ్యక్షులు కుకుడాల గోవర్ధన్ అధ్యక్షత వహించగా తెలంగాణ సాహితి రాష్ట్ర కార్యదర్శి కె. ఆనందాచారి తెలంగాణ సాహితి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులకు నిర్వహించిన కవితల పోటీలలో ఉమ్మడి జిల్లా విద్యార్థులు 147 మంది కవితలను రాశారు. వారిలో ప్రధమ, ద్వితీయ, తృతీయ, ఐదు కన్సోలేషన్ బహుమతులు గెలుచుకున్న విజేతలకు జ్ఞాపికలను, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా ప్రముఖ సాహితీ విమర్శకులు డాక్టర్ సాగర్ల సత్తయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహితి రాష్ట్ర ఉపాధ్యక్షులు అనంతజు మోహనకృష్ణ, ప్రముఖ బాల సాహిత్య వేత్త కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు, ప్రముఖ కవి గాయకులు ఏ. బూసి నరసింహ, వేముల వెంకటేశ్వర్లు, ప్రముఖ కథా రచయిత శీలం భద్రయ్య, ప్రభుత్వ బాలసాహితివేత్త పుప్పాల కృష్ణమూర్తి, ఉనికి సాహిత్య వేదిక అధ్యక్షులు బండారు శంకర్, సృజన సాహితీ అధ్యక్షులు పెరుమాళ్ళ ఆనంద్, విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు దాసోజు శ్రీనివాసచారి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు లైన్స్ క్లబ్ చాలెంజర్స్ అధ్యక్షులు వనం శ్రీ కిషన్, ప్రముఖ న్యాయవాది యన్. భీమార్జున రెడ్డి, కవులు రచయితలు డాక్టర్ చింతోజు మల్లికార్జున చార్య, తుల శ్రీనివాస్, బాసరాజు యాదగిరి, నాగిరెడ్డి అరుణ జ్యోతి పాల్గొనగా సభ సమన్వయ కర్తలుగా పుప్పాల మట్టయ్య, బూర్గు గోపికృష్ణ,గేర నరసింహ, పగిడిపాటి నరసింహ, తరుణోజు భీష్మాచార్య వ్యవహరించారు.