మహిళా మంత్రులను కించపరచటం ఫ్యాషనైంది : మంత్రి సీతక్క

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎంగిలి పూల బతుకమ్మ పండుగ రోజే కేటీఆర్‌ గలీజ్‌ మాటలు వినాల్సి రావటం దురదృష్టకరమని రాష్ట్ర మంత్రి సీతక్క బుధవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్‌ వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ మొదటి రోజే మహిళా మంత్రులను కించ పరిచి ఆయన తన నైజాన్ని చాటుకున్నారని తెలిపారు. మా నోళ్లను ఫినాయిల్‌తో కడగాలనీ మాట్లాడిన కుసంస్కారి కేటీఆర్‌ అని విమర్శించారు. పండగ పూట మహిళలు, మహిళా మంత్రులను కించపరచటం ఫ్యాషనై పోయిందని, వారి పట్ల చీప్‌ కామెంట్‌ చేసిన ఆయన నోరునే యాసిడ్‌తో కడగాలని అన్నారు. రాఖీ పండగ రోజున కూడా బస్సుల్లో మహిళలు బ్రేక్‌ డ్యాన్సులు చేసుకోవచ్చని కామెంట్‌ చేశారని గుర్తు చేశారు. దొర దురంకారాన్ని మానుకోవాలని హెచ్చరించారు. దూషణలకు, బూతులకు బ్రాండ్‌ అంబాసిడర్‌ కేటీఆర్‌ అని తెలిపారు. రాజకీయాల్లో మహిళలు ఉండకూడదన్న లక్ష్యంతోనే బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ద్వారా పదేపదే అభ్యంతరకర కామెంట్స్‌ చేయిస్తోందని పేర్కొన్నారు.