చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. కుమారస్వామి(అక్షర) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. సోమవారం ఈ సినిమా నుంచి ‘పన్నెండు గుంజల పందిర్ల కిందా..’లిరికల్ సాంగ్‌ను దర్శకుడు శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఈ పాట చూస్తుంటే తెలంగాణ మట్టివాసన కనిపిస్తోంది. సురేష్ బొబ్బిలి మ్యూజిక్, పెద్దింటి అశోక్ కుమార్ సాహిత్యం ఆకట్టుకున్నాయి. ఇక ప్రతి పెళ్లిలో ఈ పాట వినిపిస్తుందని అనుకుంటున్నా. నేను ‘ఫిదా’ సినిమాలో వచ్చిండే పాట రూపొందించినప్పుడు అదే ఆశించాను. తెలంగాణ యాసలో పాటలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. చైతన్య రావ్ యాక్టింగ్ చాలా నేచురల్‌గా చేస్తున్నాడు. పాటలతో పాటు సినిమా కూడా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. ‘ఈపాట మీ అందరికీ నచ్చుతుంది. ఈ ఏడాది 35 లక్షల పెళ్లిల్లు ఉన్నాయట. వాటిలో లక్షలాది పెళ్లిళ్లలో ఈ పాట మారు మోగుతుందని ఆశిస్తున్నా. పెళ్లి ప్రారంభం నుంచి అప్పగింతల వరకు అన్ని కార్యక్రమాలు ఈ పాటలో చక్కగా చిత్రీకరించారు’ అని మామిడి హరికష్ణ చెప్పారు. డైరెక్టర్ కుమారస్వామి మాట్లాడుతూ, ‘ఈ మూవీలో ఈ పాట ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. ఈ పాట విని అందరూ ఎంజారు చేస్తారని ఆశిస్తున్నా’ అని తెలిపారు.