– జరగబోయే అసెంబ్లీ సమావేశాలపై పంజాబ్ గవర్నర్
– ఈనెల 20, 21 తేదీల్లో అసెంబ్లీ నిర్వహణకు ఇప్పటికే ఆప్ సర్కారు పిలుపు
చండీగఢ్ : పంజాబ్‌లోని ఆప్ సర్కారు పిలుపునిచ్చిన అసెంబ్లీ సమావేశాలు చట్టవిరుద్ధమని ఆ రాష్ట్ర గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ అన్నారు. సట్లెజ్ యమునా లింక్ కాలువ నిర్మాణంపై చర్చించేందుకు భగవంత్ మాన్ ప్రభుత్వం ఈనెల 20, 21 తేదీల్లో సెషన్‌కు ఏర్పాటు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ స్పందన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ సమావేశాల పిలుపు విషయంలో ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య వాగ్వాదం జరగడం ఈ ఏడాది ఇది రెండోసారి. ఈ ఏడాది జూన్ 19న పిలిచిన సమావేశాన్ని చట్ట ఉల్లంఘనగా గవర్నర్ అభివర్ణించారు. ఆ ప్రత్యేక సమావేశ సమయంలో అసెంబ్లీ ఆమోదించిన నాలుగు బిల్లులను గవర్నర్ ఆమోదించలేదని సమాచారం.
మార్చి 22తో ముగిసిన బడ్జెట్ సమావేశాలను పొడిగించే ప్రయత్నమే ప్రభుత్వ నిర్ణయం అని గవర్నర్ కార్యాలయం పేర్కొన్నది. ”అలా ఏదైనా పొడిగించిన సెషన్ చట్టవిరుద్ధం. అలాంటి సెషన్‌లలో నిర్వహించబడే ఏదైనా చట్టవిరుద్ధం, శూన్యమైనది” అని లేఖలో వివరించింది. గవర్నర్ కార్యాలయం ప్రతికూల స్పందనతో రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్య ఎలా ఉండబోతుందన్నది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్రం మాత్రం గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగపరుస్తూ ఇలా రాష్ట్రాల అధికారాల్లో జోక్యం చేసుకుంటున్నదని రాజకీయ విశ్లేషకులు ఆరోపించారు. ఇందుకు తమిళనాడు, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఘటనలను వారు ఉదహరించారు.