అది మీ చేతుల్లోనే ఉందిగా…

It is in your hands...– ఈ వారంలోనే న్యాయ విచారణ
–  పూర్తయ్యాకే కాళేశ్వరం పెండింగ్‌ బిల్లులు
– ప్రాజెక్టుల అవినీతిలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ భాగస్వాములు : మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై న్యాయవిచారణకు ఈవారంలోనే ఆదేశాలు జారీచేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ప్రకటించారు. విచారణ పూర్తయిన తర్వాతే కాళేశ్వరం పెండింగ్‌ బిల్లులపై ఆలోచిస్తామనీ, అప్పటివరకు ఏ ఒక్కటీ క్లియర్‌ చేయబోమని స్పష్టంచేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయం మీడియా సెంటర్‌లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారనీ, ఆయన వ్యాఖ్యలు సత్యదూరమని చెప్పారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసిమెలిసి 3500 రోజులు పనిచేశాయనీ, తాము అధికారంలోకి వచ్చి నెలకాకముందే ఆపార్టీల నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం అవినీతిపై అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి కేంద్రంలోని బీజేపీ సంపూర్ణ మద్దతిచ్చిందన్నారు. కాళేశ్వరం అవినీతిలో బీఆర్‌ఎస్‌, బీజేపీలు భాగస్వాములని చెప్పారు. ”మీరు దోచుకోండి..మాకు వాటా ఇవ్వండి” అనేవిధంగా కేంద్రం వ్యవహరించిందని ఆరోపించారు. పవర్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌, రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పోరేషన్‌ నిబంధనలు మార్చి తెలంగాణ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రుణాలు ఇప్పించిందని చెప్పారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదన్నారు. కలిసి దోచుకుందామనే రుణాలు ఇప్పించారా? బీఆర్‌ఎస్‌ అవినీతికి నిలువుటద్దంగా నిలిచిన మేడిగడ్డ బ్యారేజీని ఇప్పటివరకు ఎందుకు సందర్శించలేదు? నోరు మెదపని అప్పటి సీఎంను ఎందుకు ప్రశ్నించలేదు? మీడియాపై నిషేధం విధించినా ఎందుకు స్పందించలేదు? అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై ఉత్తమ్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటీఎంలా మారిందని విమర్శలు చేసే బీజేపీ అగ్ర నేతలు విచారణకు ఎందుకు ఆదేశించలేదు? కేసీఆర్‌ను అరెస్టు ఎందుకు చేయలేదు? అని నిలదీశారు. దేశంలో ప్రతిపక్ష నాయకులను అన్యాయంగా అరెస్టు చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కేసీఆర్‌పై అంత ప్రేమ ఎందుకని ప్రశ్నించారు. లిక్కర్‌ స్కాంలో కవితను అరెస్టు చేయకపోవడం వెనక మతలబేంటని నిలదీశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల అవినీతి కారణంగా తెలంగాణ ప్రజలపై లక్షల కోట్ల భారం పడిందని చెప్పారు. కాళేశ్వరం అవినీతిలో భాగస్వాములైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తేలేదని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టంచేశారు.