నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీసీ రిజర్వేషన్లపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎక్కడిదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గించింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. కులగణనపై ఇప్పటి వరకు ఆయన ఎందుకు స్పందించలేదో కవిత సమాధానం చెప్పాలని నిలదీశారు. 2014లో రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ఏమైందో కవిత తన తండ్రిని అడగాలని సూచించారు. ఆ సర్వే లెక్కలు బయట పెట్టకుండా పదేండ్లు మోసం చేసి ఇప్పుడు కులగణనపై మాట్లాడడం వింతగా ఉందని విమర్శించారు. నిజంగా టీఆర్‌ఎస్‌కు, కవితకు బీసీల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే టీఆర్‌ఎస్ అధ్యక్షునిగా బీసీలకు అవకాశం ఇవ్వాలన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. గతంలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి, చివరికి దళిత, బీసీ మంత్రుల్ని బర్తరఫ్ చేసి బడుగులను అవమానించిన చరిత్ర టిఆర్‌ఎస్ పార్టీది కాదా? అని విమర్శించారు. బీసీ ఉద్యమాలకు కవిత సహయ, సహకారాలు అవసరం లేదన్నారు. బీసీ ఉద్యమాలు ఎలా నడపాలో, బీసీల డిమాండ్లను ఎలా నెరవేర్చు కోవాలో తమకు తెలుసని అన్నారు. బీసీల డిమాండ్ల పట్ల టీఆర్‌ఎస్‌లోని బీసీ నేతలు మాట్లాడితే బాగుంటుందనీ, వారి తరఫున కూడా కవిత మాట్లాడడం బీసీలపై పెత్తనం చలాయించడమే అవుతున్నదని విమర్శించారు.