బంగారు తెలంగాణతో బాగుపడ్డది కేసీఆర్‌ కుటుంబమే

బంగారు తెలంగాణతో బాగుపడ్డది కేసీఆర్‌ కుటుంబమే– నన్ను ఓడించిన వాళ్లందరికీ రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చా
– మతం పేరుతో వస్తున్న బూర నర్సయ్యకు బుద్ది చెప్పాలే : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి
నవతెలంగాణ-యాదగిరిగుట్ట
బంగారు తెలంగాణతో బాగుపడ్డది కేసీఆర్‌ కుటుంబం మాత్రమేనని పేదలకు పదేండ్లలో కనీసన్యాయం జరగలేదని భువనగిరి పార్లమెంట్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. శనివారం యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో జరిగిన ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనను ఓడించిన వాళ్లందరికీ అసెంబ్లీ ఏన్నికలలో రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చానన్నారు. ఒకసారి కులం పేరుతో గెలిచి, ఈసారి మతం పేరుతో వస్తున్న బూర నర్సయ్యకు ప్రజలే బుద్ది చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి ఆలేర్‌లో లక్ష ఓట్ల మెజార్టీ ఇవ్వాలని కోరారు. 2019లో భువనగిరి ఇన్‌చార్జిగా కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిని గెలిపించానని ప్రస్తుతం తమ్ముడు కిరణ్‌ కుమార్‌ రెడ్డిని గెలిపిస్తానన్నారు. భువనగిరి గడ్డ అంటే కాంగ్రెస్‌ పార్టీ అడ్డా అని అన్నారు. 20 ఏండ్ల నుండి కాంగ్రెస్‌ పార్టీ గురించి పోరాటం చేస్తున్న వ్యక్తి కిరణ్‌ రెడ్డి అన్నారు. భువనగిరి సీటును ఏనాడూ నా కుటుంబం ఆశించలేదని ప్రజలే తన బార్య పోటి చేయాలని కోరుకున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎవరికి టికెట్‌ ఇచ్చినా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిదన్నారు. నత్తి నత్తిగా మాట్లాడుతూ నక్కలాగా వ్యవరిస్తున్న బూర నర్సయ్యను నమ్మొద్దన్నారు. భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలో కులం, మతం పనిచేయదన్నారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య మాట్లడుతూ కేసీఆర్‌ 10 ఏండ్లు పరిపాలించి తెలంగాణను అప్పుల పాలు చేశాడని అన్నారు. ప్రజలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఇవ్వకుండా ఆయన మాత్రం పెద్దగా ఫామ్‌ కట్టుకున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను తీసుకొచ్చి ప్రజాపాలన చేస్తోందన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌ కూమార్‌ రెడ్డి మాట్లడూతూ కరోనా సమయంలో ప్రజలకు సేవ చేసిన గొప్ప వ్యక్తి బీర్ల ఐలయ్య అన్నారు. పార్లమెంట్‌ పరిధిలో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామన్నారు.