అది ‘మినీ భారత్‌’!

Sampadakiyamదేవతల దేశంగా పిలువబడే నేల కేరళ. అంతేకాదు, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా చెప్పబడే నేల. అనేక మతాలు, జాతులు, ప్రజలతో సహజీవనం చేస్తున్న సహనశీల తలం. వందశాతం సంపూర్ణ అక్షరాస్యత, సామాజిక చైతన్యంతో భాసిల్లుతున్న భూమి. చతాంబి స్వామి, శ్రీ నారాయణగురు, అయ్యన్‌కాళీ లాంటి సంఘ సంస్కర్తలు నడయాడిన నేల. ప్రగతిశీల సామరస్య పాలనలో దేశంలోనే ప్రత్యేకత సంతరించుకున్నది కేరళ. అలాంటి రాష్ట్రంలో ఆదినుంచి విద్వేష కుంపటి రగిలించాలను కుంటున్నది ఆరెస్సెస్‌-బీజేపీ. శబరిమల వివాదం ఒక ఎత్తయితే ‘ది కేరళ స్టోరీ’ వరకు అంతా అట్టర్‌ ప్లాపే. నిరంతరం లౌకికత్వాన్ని చాటే అక్కడి ప్రజలు ఎప్పటికప్పుడు విద్వేషపు కుట్రల్ని తిప్పి కొడుతూనే వున్నారు.అయినప్పటికీ సంఫ్‌ు పరివార్‌ ఆశ చావడం లేదు. అవకాశం దొరికినప్పుడే కాదు, వీలు కల్పించు కుని మరీ విద్వేషాగ్ని రగిలి స్తున్నది.
మొన్నటికి మొన్న మహారాష్ట్ర మంత్రి నితీష్‌రాణే కేరళను ‘మినీ పాకిస్థాన్‌’ అంటూ చేసిన వ్యాఖ్య ‘హిందూత్వ’ పడగను మరోసారి తట్టిలేపింది. మతం పేరుతో ప్రజల్ని విభజిస్తూ పాలించాలనే వ్యూహాన్ని బహిర్గతపరిచింది. లౌకికవాదం, మత సామరస్యానికి కంచుకోట అయిన కేరళపై సంఫ్‌ు పరివార్‌ చేసే విద్వేష ప్రచారాన్ని వెల్లడిచేసింది. బీజేపీకి చెందిన ఆ మంత్రి కాంగ్రెస్‌ అగ్రనేతలను ఉద్దేశించి ‘కేరళ మినీ పాకిస్థాన్‌ అయినందునే వయనాడ్‌ నుంచి వారిద్దరు ఎంపీలుగా ఎన్నికయ్యారు’ అని వ్యాఖ్యానించారు. ఒక మంత్రి ఇంకొక రాష్ట్రంపై చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అంతరార్థమేంటి? లౌకికవాదులైన భారత ప్రజలను ఎటుతిప్పదలుచుకున్నారు కాషాయపు నేతలు.
చట్టసభల్లో ప్రజాప్రతినిధిగా ఎన్నికైనవారు భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడతానని, రాగ ద్వేషాలకతీతంగా పాలన అందిస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. కానీ, మంత్రి రాణే వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కాదు, మత సామరస్యానికి తీవ్ర విఘాతం కూడా. ఇలాంటివారికి మంత్రిగా కొనసాగే నైతిక హక్కు ఉందా? కేరళ రాష్ట్రం పాకిస్థాన్‌లోనే ఉన్నట్టుగా మాట్లాడిన తీరు తీవ్ర అభ్యంతరకరం. రాణే వ్యాఖ్యలు దేనికి సంకేతమో ప్రధాని నరేంద్రమోడీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ లు సమాధానం చెప్పాలి. ఎక్కడపడితే అక్కడే బీజేపీ-సంఫ్‌ు పరివార్‌ నేతలు బహిరంగ సభల్లో, సదస్సుల్లో మతోన్మాద విషాన్ని చిమ్ముతుంటే భిన్నత్వంలో ఏకత్వం రోజురోజుకూ ప్రశ్నార్థకమవుతున్నది. ఇది ఒక్క హిందువులనో, ముస్లింలనో కాదు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. లౌకికవాదానికి, ప్రగతిశీల సమైక్యభావనకు పర్యాయపదంగా నిలిచే కేరళపై విద్వేష వ్యాఖ్యలు సిగ్గుచేటు. కేరళ అంటేనే ప్రగతి. అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతూ దేశాన్ని ఆకర్షిస్తున్నది. ఇది సంఫ్‌ు పరివార్‌కు అస్సలు రుచించడం లేదు. అందుకే వామపక్షాల ఏలుబడిలోని ‘ఎల్‌డీఎఫ్‌’ను ఎదుర్కోలేక విద్వేషాలతో ప్రజల్ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తున్నది.పైగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులకూ కొర్రీలు పెడుతున్నది. రాయితీలు తగ్గించి పన్నుల భారం మోపుతున్నది. కేంద్ర భారాలు, హెచ్చుతగ్గులు ఎలా ఉన్నా తమ రాష్ట్రానికి లాభమా, నష్టమా అని బేరీజు వేసుకున్న తర్వాతే అక్కడ అమలుకు సిద్ధపడుతున్నది కేరళ సర్కార్‌.
‘కులం, మతం, జాతీయత ఆధారంగా చేసే విద్వేష ప్రసంగాలు రాజ్యాంగం ఉపదేశించిన సౌభ్రాతృత్వానికి సవాళ్లు విసరడమే కాదు, దేశ ఐక్యతనూ దెబ్బతీస్తాయి’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా గుజరాత్‌లో ఇటీవల నిర్వహించిన ఓ సదస్సులో ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవంగా చూస్తే కూడా దేశం చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉందని చెప్పడానికి ఇటీవల పార్లమెంట్‌లో అమిత్‌షా అంబేద్కర్‌ మీద చేసిన వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. అంతేకాదు, ఉత్తరప్రదేశ్‌లో ఈనెల పదమూడు నుంచి ప్రారంభం కానున్న మహాకుంభమేళాలో హిందూయేతరులకు దుకాణాలు కేటాయించవద్దని అఖిల భారతీయ అఖాడా పరిషత్‌ చీఫ్‌ మహంత్‌ రవీంద్ర పురీ వ్యాఖ్యా నించారు. ‘వాళ్లు ఎక్కడబడితే అక్కడ ఉమ్ములేస్తారు.. మూత్రం పోస్తారు. పవిత్ర మహాకుంభమేళా అపవిత్రం అయిపోతుంది.’ అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే బీజేపీ-ఆరెస్సెస్‌ నిలువెల్లా మతోన్మాద విషాన్ని నింపుకుని పాలన సాగిస్తోంది. ఈ విభజన సిద్ధాంతాలు, ఆర్థిక అసమానతలు, ప్రజల్ని ఐక్యంగా ఉంచలేవు. పైగా అట్టడుగువర్గాలకూ సామాజికన్యాయాన్ని అందించలేవు. తిరోగమన విధానాలకు నెలవైన మనుస్మృతిని వల్లెవేస్తూ విద్వేషవ్యాఖ్యలు చేసే వారి విషపు కోరల్ని ప్రజలే పీకి పారేయాలి.