కాలం తెచ్చిన కరువు కాదు..కాంగ్రెస్‌ తెచ్చిన కరువు

– కౌలు రైతుల భరోసా ఏది? : మాజీ మంత్రి కేటీఆర్‌
– ఎండిన పంట పొలాల పరిశీలనొ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో నిరసనలు
నవతెలంగాణ – తంగళ్ళపల్లి/పెద్దపల్లి/జన్నారం
ఇది కాలం తెచ్చిన కరువు కాదని, ముమ్మాటికి కాంగ్రెస్‌ తెచ్చిన కరువేనని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామంలో ఎండిన వరి పంట పొలాలను గురువారం ఆయన పరిశీలించారు. కౌలు రైతులతో మాట్లాడి పంట పొలాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచినా రూ.2 లక్షల రుణమాఫీ ముచ్చట ఇప్పటివరకు ప్రస్తావించలేదన్నారు. పైగా బ్యాంకుల ద్వారా నోటీసులు ఇప్పిస్తూ.. మెడపై కత్తి పెట్టి రుణాలు కడతారా.. చస్తారా.. అన్నట్టు కాంగ్రెస్‌ ప్రభుత్వం పనితీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసాకు కేసీఆర్‌ రూ.10 వేలు ఇస్తానంటే రేవంత్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక రూ.15 వేలు ఇస్తానని చెప్పి.. అది కూడా అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. రైతుబంధు కోసమని కేసీఆర్‌ ప్రభుత్వం రూ.7 వేల కోట్ల ఖజానా ఉంచిపోతే.. కాంట్రాక్టర్ల కోసం, కాంట్రాక్టర్ల ఖజానా నింపడం కోసం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తెరతీసిందన్నారు. ఎండి పోయిన 15 లక్షల ఎకరాలను రాష్ట్రవ్యాప్తంగా తమ ఎమ్మెల్యేలతో పరిశీలిస్తున్నామని తెలిపారు. రైతులను చూస్తే నిజంగానే బాధేస్తున్నదన్నారు. మేడిగడ్డ వద్ద కుంగిపోయిన మూడు పిల్లర్ల వద్ద కాపర్‌ డ్యామ్‌ కడితే అయిపోయేది. దాన్ని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీకి జాతరలు, యాత్రలు తప్పితే రాష్ట్రానికి రేవంత్‌ చేసిందేమీ లేదన్నారు. కౌలు రైతులు, రైతులకు చేస్తానన్న లబ్ది చేకూర్చాలని డిమాండ్‌ చేశారు. రైతులకు ఇస్తానన్న క్వింటాలుకు రూ.500 బోనస్‌ వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తామున్నామని, రైతులు ధైర్యంగా ఉండాలని స్పష్టం చేశారు. ఎలాంటి తీవ్రమైన చర్యలకు పాల్పడవద్దని కోరారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25వేలు నష్టపరిహారం వెంటనే అందించాలని డిమాండ్‌ చేశారు.
బీఆర్‌ఎస్‌పై తెలంగాణ ప్రజలకు అబద్ధాలు చెప్పి, మాయ మాటలతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. గోదావరిఖనిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ రైతులు పడ్డ కష్టాలు మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో తెలంగాణ రైతాంగం పడాల్సి వస్తుందన్నారు. సాగునీరు అందక రైతులు పంటలు ఎండిపోయి నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే రైతులకు పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యలపై ఈ నెల 30న రైతు నిరసన దీక్షను పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చేపట్టనున్నట్టు తెలిపారు.మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఖానాపూర్‌ బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి భుక్య జాన్సన్‌ నాయక్‌ డిమాండ్‌ చేశారు. గురువారం మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పంట దెబ్బతిన్న రైతులకు మనోధైర్యాన్ని ఇచ్చారు. ఆరుగాలం కష్టపడిన రైతులు పంట చేతికి వచ్చే దశలో, అకాల వర్షాలకు నేలపాలవడంతో తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఉన్న పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. గ్రామంలో దాదాపు 70 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. కార్యక్రమంలో జన్నారం జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్‌, మండల కోఆప్షన్‌ సభ్యులు మున్వర్‌ అలీ ఖాన్‌, మండల ప్రధాన కార్యదర్శి సులువ జనార్ధన్‌, జిల్లా అధికార ప్రతినిధి సిటీమల భరత్‌ కుమార్‌, జిల్లా నాయకులు పాల్గొన్నారు.