ప్రజల్లో మత విద్వేషాలు రగిల్చి ఆ మంటల్లో చలి కాచుకొనే హీనులు తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు చేసిన పోరాటంగా వక్రీకరిస్తున్నారు. ఇది హిందూ మతవాదుల ప్రయత్నమైతే అదే నాణానికి రెండోవైపున ఉండే ముస్లిం మతవాదులు కూడా అదే పనిలో ఉన్నారు. నిజాం పాలనలో ముస్లింలందరూ సర్వసంపదలతో, భోగ విలాసాలతో తులతూగినట్లు నమ్మబలుకుతున్నారు. నిరుపేద ముస్లింను కూడా భ్రమల్లో ముంచి మద్దతు సాధించడానికి ముస్లింలందరూ ప్రభువులే అంటూ నిజాం ఇచ్చిన అనల్ మాలిక్ (నేను ప్రభువునే) నినాదాన్ని ముస్లిం రాజకీయ పార్టీ ఇప్పటికీ పరోక్షంగా ప్రస్తావిస్తోంది, తద్వారా వారిని ప్రేరేపించి ఎన్నికల్లో గెలుస్తుంది.
నిజాం ముస్లిమే అయినప్పటికీ ఆయన పాలనకు పునాదులుగా నిల్చిన జమీందార్లు, దేశ్‌ముఖ్‌లు, భూస్వాములు ప్రధానంగా హిందువులే. నిజాం ఇచ్చిన అధికారాలతో వారు గ్రామాల్లోని రైతులను, వత్తిదార్లను కాల్చుకొని తినేవారు. వారి అకత్యాలకు అంతులేదు. శిస్తుల పేర, వెట్టిచాకిరీ పేర రైతులను, వృత్తిదార్లను అట్టడుగు ప్రజలను అష్టకష్టాల పాల్జేశారు. అప్పులిచ్చి, దొంగలెక్కలు చూపి భూములు కబ్జా చేసేవారు. వేలకు వేల ఎకరాలు వారి ఆధీనంలో ఉండేది. ఆ భూమిలో పంటలు పండించి జమీందారుల, దేశముఖ్‌ల ధాన్యపు గల్లా నింపడానికి రైతులు వెట్టి చాకిరి చేసేవారు. దొరలు తమను ప్రశ్నించిన వారిపై తీవ్ర దండనలు విధించి ఉన్నదల్లా ఊడ్చుకొనే వారు. అలా దొర మడి, గడి రెండూ ప్రజల పాలిట నిరాటంక నరక కూపాలుగా చెలామణి అయ్యాయి. భూమి కోసం, వెట్టి నుండి విముక్తి కోసం ప్రజలు చేపట్టిన పోరాటాన్ని అణచడానికి నిజాం పంపిన రాక్షస సైన్యం రజాకార్లకు ఆ గడీలే రక్షణ దుర్గాలయ్యాయి.
ఈ సందర్భంగా ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రవర్తించిన తీరు కూడా ప్రశంసనీయంగా ఏమీ లేదు. హోం మంత్రి సర్దార్ పటేల్ మార్గదర్శనంలో హైదరాబాద్ రాజ్యంలోకి ప్రవేశించిన సైన్యాలు మరాఠ్వాడలోని, ఉస్మానాబాదు తదితర ప్రాంతాల్లో హిందూ మతవాదుల సహకారంతో ముస్లింలపై హింసకు తలపడింది. రజాకార్ల నాయకుడు ఆ ప్రాంతం వాడు కావడం కారణమైంది. తెలంగాణలో అలాంటి పరిణామాలు సంభవించలేదు. తెలంగాణలో మతశక్తుల ప్రాబల్యం కాకుండా కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉండటమే దానికి కారణం. అక్కడి ముస్లింలను రక్షించడానికి నిజాం ప్రయత్నించలేదని అప్పటి ఉస్మానాబాదు కలెక్టర్ ఆత్మకథను బట్టి స్పష్టమవుతుంది. కానీ యూనియన్ అదే సైన్యం హైదరాబాదు పరిసరాల్లోకి రాగానే నిజాం నవాబు తాను లొంగిపోతున్నట్లు, హైదరాబాద్ రాజ్యాన్ని యూనియన్‌లో విలీనం చేస్తున్నట్లు ఆకస్మికంగా ప్రకటించాడు. ఆనాటి చారిత్రక పరిణామాలపై రచనలు చేసిన నిజాం ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా నిజాం ఏం చేయనున్నారో చివరిదాకా తమకు తెలియదని చెప్పారు. దానర్థం నిజాంకు యూనియన్ ప్రభుత్వానికి మధ్య రహస్య చర్చలు జరిగి ఒక అవగాహనకు వచ్చి ఉండాలి. అయినా నిజాం ముస్లింల భద్రతకు ఎందుకు ప్రయత్నించలేదో మత వాదులే చెప్పాలి.
నిజాం యూనియన్ ప్రభుత్వానికి లొంగిపోయిన తర్వాత ఆయన పాలనలో ప్రజలపై జరిగిన అకత్యాలపై విచారణ జరిపి ఉండాల్సింది. కాని అలా జరగలేదు. ఆయనకు రాజ్ ప్రముఖ్ అనే బిరుదునిచ్చి మరీ గవర్నర్‌గా కూర్చోబెట్టారు. ఎదురు కట్నం రీతిలో ఆ నాటి ప్రపంచ కుబేరుడికి భారీ రాజభరణం ఖరారు చేశారు. పాకిస్థాన్‌కు పారిపోయిన వారు పారిపోగా తన ప్రయత్నం సఫలం గాక పట్టుబడిన కాశీం రజ్వీకి చేసిన నేరాలకు తగిన శిక్ష పడలేదు. ప్రజల నుండి దండుకొన్న నిజాం ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు. వాటికి పూర్తి రక్షణ కల్పించింది. రూమీ టోపి, షేర్వానీ వదిలి ఖద్దరు దుస్తులు ధరించిన దొరలను కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తుంది. వారిని తిరిగి గడీల్లో ప్రతిష్టించింది. దున్నేవాడికి దక్కిన భూమిని యూనియన్ సైన్యాల బలంతో లాక్కొని మళ్లీ దొరలకు కట్టబెట్టింది. అందుకోసం కమ్యూనిస్టుల, నిరుపేదల రక్తం పారించింది. వేల మందిని యూనియన్ సైన్యాలు బలితీసుకున్నాయి.
మరోవైపు అపర గాంధీగా చెప్పుకునే వినోభాబావేని రంగంలోకి తెచ్చారు. దొరలు తమ ఇష్టపూర్తిగా తమ ఆధీనంలోని భూములు ఆయనకి ఇస్తారని, వాటిని ఆయన రైతులకు పంచుతాడని కపటనాటకం ఆడారు. దున్నేవాడి చేతినుండి భూములు లాగేసుకొన్నవారు. ఆ విషయము కనుమరుగు చేసి చచ్చుపుచ్చు భూ పరిమితి చట్టం తెచ్చి పేదలకు భూములు పంచామని గొప్పలు చెప్పుకొన్నారు. ప్రభుత్వాలు ఎన్ని భుజకీర్తులు తగిలించుకొన్నా ఏదో ఒక మేరకు భూ పరిమితుల చట్టం తేక తప్పని పరిస్థితిని తెచ్చిపెట్టింది కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అశేష త్యాగాలతో సాగిన తెలంగాణ సాయుధ పోరాటమే. పోరాటం సందర్భంగా కమ్యూనిస్టులను పట్టుకొని జైళ్లల్లో చిత్రహింసలు పెట్టారు. ఉరిశిక్షలు వేశారు. పోరాటం విరమణ తర్వాత చాలా కాలం పోరాట వీరులపై కేసులు నడిపారు.
పరిపాలనును ప్రజల నుండి దూరంగా ఉంచడానికి భాషను కూడా ప్రభువులు వాడుకొన్నారు. హైదరాబాదు రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు మాట్లాడుకొనే భాషలు తెలుగు, మరాఠీ, కన్నడ. కాని 6వ నిజాం మహబూబ్ అలీఖాన్ హయాంలో మాత్రమే అధికార భాషను పారసీ నుండి ఉర్దూకు మార్చారు. మొగళ్లు నియమించిన మొదటి నిజాం ఇరాన్‌కు చెందిన వాడు కనుక ఆయన నుండి మొదలు పెట్టి 6వ నిజాం వరకు పారసీలోనే ప్రభుత్వ వ్యవహారాలు సాగాయి. ఆ కారణంగానే హైదరాబాదు పండితులు పారసీ కూడా నేర్చుకొనే వారు. ఇక 7వ చివరి నవాబు ఉస్మాన్ అలీ పాషా పాలనలో ఉర్దూను అధికార భాషగా ప్రకటించడంతో పాటు ప్రజల మీద ఆ భాషను బలవంతంగా రుద్దారు. తెలుగు, మరాఠీ, కన్నడ భాషలను అపహాస్యం చేశారు. తెలుగును తెలంగీ బేడంగీ (పద్ధతి పాడూలేని) అని అవమానించారు. సభల్లో తెలుగులో మాట్లాడం పై నిషేధం విధించారు. తెలుగులో చదువుకో రాదన్నారు. కాగా పరిపాలనలో ప్రజల భాషను దూరంగా బెట్టడంలో మన ‘ప్రజాస్వామ్య’ ప్రభుత్వాలేమీ తక్కువ తినలేదు. గత శతాబ్ది 80 వ దశకంలో గానీ ప్రభుత్వ వ్యవహారాల్లో తెలుగును అమలు చేయడానికికంటూ అధికార భాషా సంఘాన్ని నియమించారు. ఒకరిద్దరిని మినహాయిస్తే ప్రభుత్వాలన్నీ తెలుగు పండితులను వాటికి చైర్మన్లుగా నియమిస్తూ వచ్చారు. చివరికి ఓ శతావధానిని ఆ పదవిలో కూర్చోబెట్టారు. ఆయన తన భాషా పాండిత్యంతో, చాతుర్యంతో సభికులను రంజింప చేయగలడు తప్ప ప్రభుత్వ వ్యవహారాల్లో తెలుగును ఎలా అమలు చేయగలడు? దాన్ని బట్టి ఆయనను నియమించిన ప్రభుత్వం ఎంత ఆషామాషీగా వ్యవహరించిందో గమనించవచ్చు. ఇప్పటకీ ప్రభుత్వ వ్యవహారాలు ఇంగ్లీషులోనే నడుస్తున్నాయి. ఏదో ఒక మేరకు తెలుగు అమలవుతున్నా అది తెనాలి రామలింగడు, పిల్లి లాంటి తెలుగు. తెలుగు నడకలేని ఆ తెలుగును చదవడం కంటే ఇంగ్లీషులో చదువుకోవడం మేలనిపిస్తుంది. ప్రభుత్వ వ్యవహారాల్లో ప్రజల భాషను దూరంగా ఉంచడం మనకు ప్రపంచంలో చాలా చోట్ల కనిపిస్తుంది. మన ‘ప్రజాస్వామ్య’ ప్రభుత్వాలూ అందుకు మినహాయింపు కాదు.
నిజాం పాలనకు వ్యతిరేకంగా చాలామంది ముస్లింలు కూడా పోరాడారు. నిజాం నవాబు బ్రిటిష్ పాలకుల చెప్పులు మోస్తున్నాడని, తుర్రె బాజ్‌ఖాన్ న్యాయకత్వంలో రోహిల్లాలు సాయుధులై కోఠీలోని వైస్రాయి భవనం పై దాడి చేశారు. నిజాం బలగాలు రంగంలోకి దిగి వైస్రాయిని కాపాడాయి. తుర్రె బాజ్‌ఖాన్‌ను పట్టుకొని చంపేశాయి. 1917లో రష్యాలో విప్లవం జయప్రదమైంది. ఆ స్పూర్తితో ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన ముస్లిం జర్నలిస్టులు హైదరాబాదులో ఉర్దూ పత్రికలు పెట్టి, నిజాం పాలనను, ఆయనకు ఆంగ్ల పాలకులకు ఉన్న సంబంధాలను ఏకి పారేశారు. వాటిపై కొంతకాలం తర్వాత నిజాం చర్యలు తీసుకోవడంతో అవి మూతపడ్డాయి. రజాకార్ల ఫత్వాను లెక్కచేయకుండా వారి ఆగడాలను ఎండగట్టి హత్యకు గురైన షోయబుల్లాఖాన్ కూడా ముస్లిమే. నిజాం పాలనకు వ్యతిరేకంగా అనేక చోట్ల ముస్లింలు పోరాటం చేశారు. భూమి కోసం స్థానిక భూస్వామితో పోరాటం చేసి, కోర్టులో గెలిచి చివరికి భూస్వామి చేతుల్లో మరణించిన షేక్ బందగీ ముస్లిమే. ఆ ముస్లిం రక్షణకు నిజాం ప్రభుత్వం నిలబడలేదు. నిజాం ప్రభుత్వ యంత్రాంగం భూస్వామి అండన చేరింది.
నిజాం వ్యతిరేక పోరాటమంటే ముస్లిం వ్యతిరేక పోరాటమేనని కాశీం రజ్వీ అన్నాడు. అదే గోత్రానికి చెందిన బిజెపి కూడా అదే మాట అంటుంది. తెలంగాణ సాయుధ పోరాటం నిజాం పరిపాలనకు భూస్వామ్య విధానానికి వ్యతిరేక పోరాటమే తప్ప ముస్లిం వ్యతిరేక పోరాటం కాదని ఆనాటి పోరాట ప్రముఖుడు ఉర్దూ కవి మగ్దూం మోహియుద్దీన్ అన్నారు. హైదరాబాదులో కమ్యూనిస్టుల అధ్వర్యంలో ఏర్పడిన కామ్రేడ్స్ అసోషియేషన్‌లో ఆనాటి ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొ. ఆలంకుంద్ మరి, జావేద్ రజ్వీలు కూడా ముస్లింలే. కాగా రజాకార్ల సంఘానికేమో విసునూరి రామచంద్రారెడ్డి ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. అలాంటప్పుడు దాన్ని రజాకార్లు భూస్వామ్య వ్యవస్థ సైనికులని అనాలా? ముస్లిం సైనికులనాలా? కనుక తెలంగాణ సాయుధ పోరాటం పీడితులు, పీడకుల మధ్య జరిగిన పోరాటమే తప్ప ఏ విధంగానూ అది మత ప్రాతిపదికపై జరిగిన పోరాటం కాదు.
ఎస్.వినయకుమార్