– ఇజ్రాయిల్‌పై మండిపడ్డ బ్రెజిల్ అధ్యక్షుడు లూలా
డెయిల్ అల్-బలా, గాజా : గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ మారణహౌమానికి పాల్పడుతోందంటూ బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసిల్వా విమర్శించారు. గాజపై ఇజ్రాయిల్ మిలటరీ దాడులు నాజీల అకృత్యాలను తలపిస్తున్నాయంటూ వారం రోజుల క్రితమే లూలా తీవ్రంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నేడు మరోసారి ఘాటుగా విమర్శించారు. ‘అబద్ధాలు, అసత్యాలకు పరువును వదులుకోను’ అంటూ ఎక్స్‌లో లూలా పోస్టు పెట్టారు. గాజాలో ఇజ్రాయిల్ వ్యవహరిస్తున్న తీరును నాజీల దారుణాలతో పోలుస్తూ తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని వస్తున్న డిమాండ్లను ప్రస్తావిస్తూ ఆయన ఈ పోస్టు పెట్టారు. ‘ఇజ్రాయిల్ ప్రభుత్వం చేస్తోంది యుద్ధం కాదు, మారణహౌమం, మహిళలు, పిల్లలను హతమారుస్తున్నారు.’ అని ఆయన శనివారం నాటి పోస్టులో స్పష్టం చేశారు. లూలా గత వారం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఇజ్రాయిల్ ఆయనను అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించింది. బ్రెజిల్ రాయబారిని పిలిపించి, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయిల్‌లో బ్రెజిల్ రాయబారిని చర్చల నిమిత్తం లూలా వెనక్కి పిలిపించారు. ఇజ్రాయిల్‌పై విచారణ చేపట్టాలంటూ గత నెల్లో దక్షిణాఫ్రికా అంతర్జాతీయ న్యాయ స్థానంలో ఫిర్యాదు చేసింది.