
నవతెలంగాణ – కంటేశ్వర్
ఓట్ ఆన్ బడ్జెట్ లో ప్రభుత్వ విద్యారంగానికి అరకొర నిధులు కేటాయించడం సరికాదని ఎస్ఎఫ్ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహానం చేశారు. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా, ప్రభుత్వ విద్యారంగా అభివృద్ధి కొరకు తక్కువ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ ను స్థానిక న్యాల్కల్ చౌరస్తాలో దద్దం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కార్యదర్శి పోషమైన మహేష్ మాట్లాడుతూ నిన్న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఓట్ ఆన్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని, అందులో విద్యారంగానికి కేవలం 7.8% అంటే రూ.21,389 కోట్ల రూపాయలు కేటాయించిందని, గత బడ్జెట్ తో చూసినప్పుడు కేవలం1.31 శాతం మాత్రమే పెంచారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనికి రాక ముందు బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 15% నిధులు కేటాయిస్తామని చెప్పి, ఇప్పుడు గత ప్రభుత్వ ఆనవాయితీని కొనసాగిస్తుండడం బాధాకరమని అన్నారు. అదేవిధంగా ఈ బడ్జెట్లో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్, సంక్షేమ హాస్టల్లో మెస్, కాస్మోటిక్ చార్జీల బిల్లులపై స్పష్టత లేదు. అలాగే యూనివర్సిటీల అభివృద్ధి కొరకు గానీ, శిధిలా వ్యవస్థలో ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థల పునర్నిర్మాణం కోసం గాని, మధ్యాహ్న భోజనం సంబంధించి గాని, ఖాళీగా ఉన్నటువంటి బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలకు సంబంధించి గాని ఇప్పుడు కేటాయించిన నిధులు ఎంత మేర సరిపోతాయో రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి కొరకు కృషి చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు వేణు, నగర నాయకులు శైలజ, విష్ణు మరియు ఎస్ ఎఫ్ ఐ యూనిట్ కమిటీ సభ్యులు సజన్,రోహిత్,వంశీ, జనార్ధన్,అభి, వర్ధ రాజ్ తదితరులు పాల్గొన్నారు.