రైతు భరోసా కోసం దరఖాస్తులు చేసుకోవాలనడం సరైంది కాదు

For farmer assurance
It is not fair to apply– కౌలు రైతులను గుర్తించాలి
– అసైన్డ్‌ భూములను రెగ్యులరైజ్‌ చేయాలి : చైతన్య సేద్యం 2025 డైరీ ఆవిష్కరణలో పోతినేని, టి. సాగర్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రైతు భరోసా కోసం దరఖాస్తులు చేసుకోవాల నడం సరైంది కాదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్‌రావు, టి. సాగర్‌ అన్నారు. గ్రామ సభలు జరిపి వాస్తవ సాగుదారులను నమోదు చేసి వాస్తవ సాగుదారులందరికి రైతు భరోసా వర్తింప చేయాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో చైతన్య సేద్యం-2025 డైరీని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం, యాసంగి సీజన్లలో ఎకరాకు రూ.7500 ఇస్తానన్న వాగ్దానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలుదారులు, మరో ఆరు లక్షల మంది సాగుదారులు పట్టాదారులు లేకుండా సాగు చేస్తున్నారని తెలిపారు. వారికి సాగు హక్కులు కల్పిస్తే ప్రభుత్వ పథకాలు, పంట రుణాలు, పంటల బీమా వర్తిస్తాయన్నారు.
భూయజమానులతోపాటు, సాగుదారులకు హక్కులు కల్పించాలని కోరారు. తహశీల్దార్‌, ఆర్‌డీవో, కలెక్టర్‌, సీసీఎల్‌ఏ కార్యాలయాల వద్ద గతంలో జరిగిన లోపాలను సరిచేసే విధంగా చూడాలని కోరారు. ట్రిబ్యూనల్‌ ఏర్పాటు, గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారులను నియమించాలని డిమాండ్‌ చేశారు.
సాగుభూములను, సాగేతరభూములను విడివిడిగా రిజిష్టర్‌ తయారు చేయాలని కోరారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్కారుకు అందిన (9.12.2023) సాధాబైనామా ధరఖాస్తులను ఆమోదించాలని కోరారు. అసైన్డ్‌ భూముల సమస్యను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ భూములు (బంచరాయి, పోడు) సాగుచేస్తున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దేవాలయ, వక్ఫ్‌, ధర్మాదాయ భూములను సాగు చేస్తున్న సాగుదారుల పేర్లను రెవెన్యూ రికార్డులో నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో చైతన్య సేద్యం మాస పత్రిక ఎడిటర్‌ ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాదరావు, తెలంగాణ రైతు సంఘం సీనియర్‌ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, పి జంగారెడ్డితోపాటు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.