– తెలంగాణ కాంట్రాక్ట్ డాక్టర్స్ అసోసియేషన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రోగులు డిశ్చార్జి అయ్యేంత వరకు చికిత్స అందించడమే తమ పని అని తెలంగాణ కాంట్రాక్ట్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. ఈ మేరకు సోమవారం అసోసియేషన్ నాయకులు ఒక ప్రకటన విడుదల చేశారు. రోగులను కరవకుండా వార్డుల్లో ఎలుకలను వెతికే పని తమది కాదని తేల్చిచెప్పారు. ఐసీయూలో రోగిని ఎలుక కరిచిన ఘటనలో కామారెడ్డి ప్రభుత్వాస్పత్రి మెడికల్ ఆపీసర్ ను సస్పెండ్ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఐసీయూ ఉన్నదే రోగులను కాపాడటానికే తప్ప ఎలుకల మీద నిఘా పెట్టడానికి కాదని గుర్తుచేశారు.
జీతాలు రాక రాజీనామాలు
టీవీవీపీ ఐసీయూ కాంట్రాక్ట్ డాక్టర్లకు 10 నెలల నుంచి జీతాలు రాలేదని ఆ నాయకులు తెలిపారు. ఈ విషయంపై పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఇప్పటికే పలువురు రాజీనామా చేసినట్టు చెప్పారు. డీఎంఈ వైద్యులు, టీవీవీపీ వైద్యుల మధ్య మెరుగైన సమన్వయం అవసరమని సూచించారు. టీవీవీపీ ఐసీయూ డాక్టర్ల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.