సీఎం నిటిఅయోగ్‌ సమావేశాన్ని బహిష్కరించడం సరిగాదు

– రాష్ట్ర ప్రభుత్వం భూములిస్తే మరిన్ని రోడ్ల విస్తరణ : కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నిటి అయోగ్‌ సమావేశాన్ని బహిష్కరించడం సరిగాదనీ, భిన్నాభిప్రాయా లుంటే సమావేశానికి హాజరై తెలిపితే బాగుండేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి అభిప్రాయపడ్డారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరించడంతోనే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో వారి స్థానమేంటో తెలిసేలా ప్రజలు తీర్పునిచ్చారన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజలందరి సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌లో ఉత్పాదకత, వ్యవసాయ, యువతకు ఉపాధి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. పీఎం గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన కింద ఉచిత రేషన్‌ను మరో ఐదేండ్లు పొడిగించామని చెప్పారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్లు కేటాయించామని తెలి పారు. వాతావరణానికి అనుగుణంగా కొత్తగా 109 అధిక దిగుబడినిచ్చే వంగడాలను రైతుల సాగు కోసం విడుదల చేశామన్నారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం రూ.5336 కోట్లు కేటాయింపులు చేశామనీ, 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ తెలంగాణ గేమ్‌ చేంజర్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.